Saturday, April 18, 2026
HomeSpl Storiesనిధులవేట

నిధులవేట

*నిధులవేట*
(హారర్ స్టోరీ )

మొదటి భాగం.
రచన : తిరుమల రావు పామరాజు
భద్రాచలం
సెల్ నెం :9573547496
వరంగల్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న వూళ్లపల్లి గ్రామ శివార్లలోని ఆ పురాతనమైన కోట ఒకప్పటి తన రాచరిక వైభవాన్ని, హుందాతనాన్ని, కోల్పోయి రాత్రివేళ ఒక రాక్షస నీడలా కనబడుతోంది.
పన్నెండో శతాబ్దపు కాకతీయుల వైభవం ఇప్పుడు శిథిలాల కిందపడి సమాధి అయిపోయింది. కోట బురుజులు, గోడలకి ఉన్న నల్లటి రాళ్లు చాలా వరకు జారిపోయాయి. కోట గోడలపై పిచ్చి మొక్కలు, రావి చెట్లు మొలిచి, వాటి ఊడలు, వేర్లన్నీ కిందకి వేలాడుతున్నాయి. కానీ, దుర్భేధ్యమైన ఆ కోట గర్భంలో ఉన్న ఆ పాతబావి మాత్రం ఇంకా సజీవంగానే ఉంది… తనలో దాచుకున్న రహస్యాలతో, ప్రాణాలు తీసే మృత్యుపాశంతో…!
****
డిసెంబర్ నెల కావడంతో చలిగాలి చురకత్తిలా శరీరాన్ని కోసేస్తోంది.
ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎక్కడో నక్కల ఊళలు నిశ్శబ్దాన్ని చీలుస్తూ భీతిని గొల్పుతున్నాయి. కోట గోడ మీద కూర్చున్న గుడ్లగూబ తన మెడను 360 డిగ్రీలు తిప్పి, మృత్యువు వాసన చూస్తున్నట్టు ఆ నిశీధిలో కోట వైపు నడక సాగిస్తూ, నిశ్శబ్దంగా వస్తున్న ఆ నలుగురు మిత్రుల వైపు తీక్షణంగా చూసింది.
నిధుల వేట.. మృత్యువుతో ఆట!
****
వూళ్ళపల్లి గ్రామంలో నివసించే గున్నాబత్తుల వెంకట కనకాచారి, బత్తుల రామ్మోహన్, నున్నా వెంకటేశ్వరరావు, షేక్ ఖాజా రెహమతుల్లా, యం.డి. యాకూబ్ ఆలీ చిన్ననాటి నుండి స్నేహితులు. కలిసి చదువుకున్నారు. వీరంతా హన్మకొండ లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అందరివీ మధ్య తరగతి బ్రతుకులు.. ఎంత కష్ట పడ్డా ఎదగని జీవితాలతో అదృష్ట దేవత వాళ్ళ తలుపులు ఎప్పుడు తడుతుందో అని కలలు కంటూ ప్రతీ రోజూ వాళ్ళ బైక్స్ పై హన్మకొండ వెళ్లి వాళ్ళ ఉద్యోగభాద్యతలు నిర్వహించిన అనంతరం ఇంటికి తిరిగి వస్తారు. ప్రతీ రోజూ కోటని దాటి వెళ్తూ అటువైపు చూస్తూ ఉంటారు. కోటలోని బావి వీళ్ళ జీవితాలని భయంకరమైన మలుపు తిప్పుతుందని వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు.
***
ఒక ఆదివారం సాయంత్రం గ్రామం లోని ఆంజనేయస్వామి ఆలయం ముందు వసారాలో మిత్రబృందం కూర్చొని ఉన్నారు. ఆలయం అర్చకులు శ్రీరంగం రామాచార్యులు ను కోట గురించి అడగగా ఎనభై ఏళ్ళ ఆ వృద్ధ పూజారి చిన్నగా దగ్గి, “బాబు.. దాదాపు 800 సంవత్సరాలక్రితం కాకతీయు రాజులు ఆ కోట నిర్మించారు. మహ్మదీయుల దండయాత్రలతో, అపారమైన నిధులు కోటలోని బావిలో దాచి పెట్టారు. నిధులు దొంగలు ఎవరూ దోచుకొని పోకుండా, ఒక దుష్టశక్తిని అక్కడ కాపలా పెట్టారు. అందుకే ఎవరు నిధి కోసం వెళ్లినా, వాళ్ళు రక్తం కక్కుకొని చనిపోతున్నారు. కాలక్రమంలో రాజులు పోయారు. కోట శిధిలం అయింది. నిధి అలాగే ఉంది. ఈ విషయాలన్నీ మా పెద్దలు చెప్పగా వినడం జరిగింది” అన్నాడు. పూజారి గారికి నమస్కారం చెప్పి, మిత్రులందరూ బయటకి వచ్చారు. నిధులున్న మాట నిజమే అని పూజారి చెప్పిన విషయం మనసులో ముద్రితమై, ఆ ముప్పై ఏళ్ల యువకుల ఉడుకురక్తం పరుగులు పెడుతుంది. ఊళ్ళో, కొంతమంది పెద్దలు చెప్పిన కోటలోని బావి, అందులో దాచిన అంతులేని నిధి కథలు వారిలో భయం కంటే ఆశను, కుతూహలాన్ని పెంచాయి. పగలు సైతం ఎవరూ, చివరికి పశువుల, మేకల కాపర్లు సైతం భయంతో అటువైపు వెళ్ళరు. నిధి రహస్యం తెలుసుకోవాలని గతంలో ప్రయత్నించిన వారందరు రక్తం కక్కుకొని చనిపోయారని వార్తలు విన్న వాళ్లంతా అటువైపు తిరిగి చూడటానికి సైతం సాహసం చేయరు. పురావస్తుశాఖ అధికారులు అటువైపు వెళ్ళవద్దని ఒక బోర్డు మీద రాసి అక్కడ పెట్టి వెళ్లి ఎన్నో సంవత్సరాలు గడిచాయి.
మిత్రులంతా ఎప్పటిలాగే వాళ్ళ రాత్రి భోజనాలు అయ్యాక గ్రామ పంచాయతీ రచ్చ బండ దగ్గర భేటీ అయ్యారు. “బావి లోపలకి దిగిన వ్యక్తులు రక్తం కక్కుకుని చనిపోవడం ఏంటిరా? లోపల ఏదైనా విషవాయువు ఉండి ఉంటుంది. ఈ ఆధునిక రాకెట్ యుగంలో ఇంకా దెయ్యాలు, భూతాలు ఏమిటిరా?.. అవన్నీ లేవు. కేవలం మూఢ నమ్మకాలు మాత్రమే.. ఈసారి మనం ఆ రహస్యాన్ని చేధించాల్సిందే.. బావిలో దాచిన ఆ నిధిని పట్టాల్సిందే” అని గున్నాబత్తుల వెంకట కనకాచారి ధీమాగా అన్నాడు. “హుష్.. నెమ్మదిగా మాట్లాడరా చారి.. మన మాటలు ఎవరైనా వింటారు” అన్నాడు యాకూబ్. మిత్ర బృందంలో కనకాచారే సాహసి. కనకచారి మాటలు విన్న తరువాత, అందరి మనసులు ఉద్విగ్నతతో నిండిపోయాయి. అప్పటి దాకా వాళ్ళు కూర్చున్న అరుగు పక్కన ఉన్న వేప చెట్టుపై తలకిందులుగా వాలి ఉన్న గబ్బిలం ఒకటి నిశ్శబ్దంగా దక్షిణ దిశగా సాగిపోయింది. వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయిన మరుక్షణం అక్కడ గాలి స్థంభించి పోయింది. ఆకస్మాత్తుగా ఫెళ ఫెళ మని శబ్దం చేస్తూ వేప చెట్టు పెద్ద కొమ్మ ఒకటి విరిగి అప్పటి వరకు మిత్రులు కూర్చున్న దిమ్మపై పడింది.
***
ఆరోజు నుండి మిత్రులందరూ అందమైన ఊహల్లో తేలిపోయారు. బావిలోకి దిగి నిధి చేజిక్కించుకొని అందరు సమానవాటాలు పంచుకొన్నట్లు, వారి భాగంగా బోలెడు బంగారు ఆభరణాలు, వజ్రాలు, రత్నాలు వచ్చినట్లు, వాటితో విలాసవంతమైన పెద్ద భవనాలు నిర్మించుకొని లగ్జరీ కార్లు కొని వాటిలో తిరుగుతున్నట్లు పగటి కలలు కన్నారు. ఎంత తొందరగా ఆ నిధిని దక్కించుకుందామా అని ఎడతెగని ఆలోచనలతో వాళ్ళు ఊహల్లో విహారిస్తున్నారు.
అనుకున్న రోజు రానే వచ్చింది. ఆరాత్రి పక్క గ్రామంలో పెళ్లి ఉందని అందరు కలిసే ఆ పెళ్ళికి వెళ్లి మరుసటి రోజు ఉదయం వస్తామని మిత్రులందరూ ఇళ్లలో చెప్పి ఊరి చివర ఆంజనేయస్వామి గుడి దగ్గర రాత్రి 10 గంటలకు కలిసి కోట దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
***
అర్ధరాత్రి దాటింది. చలి గాలులు ఉధ్రుతంగా వీస్తున్నాయి. ఎక్కడో దూరంగా ఊరకుక్కలు అదేపనిగా ఆగి, ఆగి మొరుగుతున్నాయి. ఊరి చివర స్మశానం దగ్గరికి రాగానే అప్పటి వరకు ఆరిపోయి ఉన్న చితి ఆకస్మాత్తుగా పెద్ద మంటలతో వెలగడం, ఒక నల్లని నీడ వంటి ఆకారం ఫాలో అవడం వీళ్ళు చూడలేదు. చూసి ఉంటే కథ మరో మలుపు తిరిగేది. అమావాస్య దగ్గరలో ఉండటం వలన ఆకాశంలో ఎక్కడా నక్షత్రాల జాడ లేదు. మిత్రులు పొలాలు, బీళ్ళు దాటి, గంట నడక తరువాత కోట ముందున్న అగడ్తలమీదుగా ఉన్న చెక్కని దాటి, లోపలికి ప్రవేశించారు. కనకాచారి చేతిలో పెద్ద టార్చ్ లైట్, గునపం ఉన్నాయి. బత్తుల రామ్మోహన్ పార, యాకూబ్ ఆలీ పెద్ద తాడు పట్టుకొని వచ్చారు. అక్కడక్కడా పగిలి, రాళ్లు జారిపోయి ఉన్న ఆ రాతి మెట్లు జాగ్రత్తగా ఎక్కి, కోటపైకి చేరుకొన్నారు. కోట గోడలపై తెల్లని పాము కుబుసాలు గాలికి ఎగురుతుండటం చూసి, ఖాజారహమతుల్లా భయంతో యాకూబ్ చేయి గట్టిగా పట్టుకున్నాడు. తుప్పు పట్టని మూడు ఫిరంగులు, రాతి గుండ్లు, రాతి స్థంబాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అవి దాటి బావి సమీపంలోకి వెళ్లారు. టార్చిలైట్ వెలుతురులో పదడుగుల వెడల్పు ఉన్న ఆ బావి ఏదో రాకాసి నోరు తెరుచుకున్నట్లుగా భయంకరంగా కనిపిస్తోంది. బలమైన రాతి కమ్మీకి వేలాడుతున్న బరువైన ఇనుప గొలుసు శతాబ్దాలుగా ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్టు, గాలికి చిన్నగా ఊగుతోంది. ఐదుగురూ కలిసి ఆ గొలుసును పైకి లాగడం మొదలుపెట్టారు.
“కర్… కర్… కర…”
ఇనుము రాపిడికి వచ్చే ఆ శబ్దం ఆ కోట గోడల్లో ప్రతిధ్వనిస్తూ గుండెల్ని పిండేస్తోంది. ఆ గొలుసు పట్టుకోగానే ఏదో శవం కాలిన వాసనతో పరిసరాల న్నీ దుర్గంధం తో నిండిపోయాయి. ఎంత లాగినా గొలుసు అంగుళం కూడా పైకి రావడం లేదు. లోపల ఏదో భారీ వస్తువు దాన్ని పట్టి ఉంచుతున్నట్టు అనిపిస్తోంది. ఆ చల్లని వాతావరణం లో సైతం చెమటలు ధారాపాతంగా కారుతున్నాయి. బలమంతా ఉపయోగించి లాగినా కూడా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోవడంతో,కొద్ది సేపటికి,
బావి గర్భంలోకి…
“నేను దిగుతాను!” అని కనకాచారి నిశ్చయించుకున్నాడు. తన ఆలోచన చెప్పడంతో బత్తుల రామ్ మోహన్ భయంతో “వద్దురా.. చారి.. చాలా ప్రమాదం” అన్నాడు. కనకచారి మొండి పట్టుదల, ధైర్యం తెలిసిన మిత్రులు సరే అన్నారు. కనకాచారి నడుముకి తాడు కట్టుకుని, టార్చి తీసుకొని ఆ ఇనుప గొలుసును పట్టుకుని బావిలోకి మెల్లగా జారాడు. కిందకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత పడిపోతోంది. నీటి మీద టార్చి వెలుతురు పడగానే, ఆ నీరు నల్లగా, చిక్కగా ఉన్నట్టు అనిపించింది.ఆ క్షణం లో కనకాచారికి గానీ అతని మిత్రులకు గానీ తెలియని ఒక విషయం ఉంది.
నీటి మట్టానికి కొంచెం పైన ఉన్న గోడ రంధ్రాల నుండి రెండు జతల ఎర్రని కళ్లు మెరిశాయి. అవి మనుషులవి కావు…ఆ కళ్లలో ఒక వికృతమైన ఆకలి కనిపిస్తోంది.
కనకాచారి కాళ్లు నీటిని తాకాయి. అకస్మాత్తుగా నీటి అడుగు నుంచి ఏదో మెత్తని వస్తువు అతని పాదాలను చుట్టేసింది. అది పాము కాదు… చల్లని, కుళ్ళిపోయిన మాంసం ముక్కలాంటి చేతులు!
ఎంతో ధైర్యవంతుడైన కనకాచారి ఆ కళ్ళ ని చూడగానే భయంతో వణికిపోయాడు. ఊపిరి ఏమాత్రం ఆడడం లేదు భయంతో, వణుకుతున్న గొంతుతో
“ఒరేయ్! బావి లోపల… ఎవరో ఉన్నారురా!” కనకాచారి అరిచాడు. కానీ అతని గొంతు బావి గోడలకే తగిలి వెనక్కి వస్తోంది.
అదే సమయంలో అతని చెవుల్లోకి ఎవరో వేడి గాలిని వదులుతున్నట్టు అనిపించింది. ఒక భయంకరమైన గొంతుతో ఎవరో వికృతంగా నవ్వుతున్న శబ్దం. మరుక్షణమే బలమైన చేతులు అతని పీకను గట్టిగా నొక్కేశాయి. కనకాచారి కళ్లు బైర్లు కమ్మాయి. గాలి కోసం అతను అల్లాడిపోతున్నాడు.రక్త క్షుధార్తమైన ఆ నల్లని పాషాణాలు ఆకలిగొన్న జంతువుకి ఎర దొరికినట్టు కనకాచారిని ఆశగా నీటి లోపలకి బలంగా లాగడానికి ప్రయత్నం చేసాయి. పైన ఉన్న మిత్రులకు బావి లోపల ఏదో అలజడి జరుగుతున్నట్టు అర్థమైంది.
“చారీ! ఏమైందిరా? చారీ!!” రామ్మోహన్ అరిచాడు… ఓ.. ఓ.. అనే కేక
లోపల నుంచి వినిపించింది. అది కనకాచారి గొంతు కాదు… ఒక భయంకరమైన మైన అరుపు! బావిలోని నీరు ఒక్కసారిగా ఉప్పెనలా పైకి లేచింది. కనకాచారి పట్టుకున్న గొలుసు విపరీతంగా ఊగిపోతోంది.
ఆ దృశ్యం చూసి
పైన ఉన్న నలుగురు మిత్రులు భయంతో వణికిపోతూ తాడును పైకి లాగడం మొదలుపెట్టారు. అతి కష్టం మీద కనకాచారి శరీరం పైకి వచ్చింది… కానీ అతను స్పృహలో లేడు. అతని కళ్లు పైకి తేలేసాయి. ముఖమంతా నల్లగా వికృతంగా మారిపోయింది.
నేల మీద పడగానే కనకాచారి గొంతులో నుంచి గృచిక్.. గృచిక్ మని వింత శబ్దాలు వచ్చాయి. ఒక్కసారిగా అతను రక్తం కక్కడం మొదలుపెట్టాడు. ఆ రక్తం నల్లగా, దుర్వాసనతో ఉంది. అతని గొంతు మీద, గుండె పైన ఐదు వేళ్ల గుర్తులు… కనకాచారి ధరించిన బట్టలన్నీ చినిగిపోయి పేలికలు వేలాడుతున్నాయి. ఎవరో ఇనుప చువ్వలతో కాల్చి ముద్ర వేసినట్టు లోతుగా పడ్డాయి. ఒక తెల్లని ఆస్తిపంజరం హిస్.. మని శబ్దం చేస్తూ గాల్లో తేలి వస్తుంది.
దూరంగా ఉన్న ఆ గుడ్లగూబ ఇప్పుడు వికటంగా అరిచింది. కనకాచారిని లేపి బత్తుల రామ్మోహన్ తన భుజంపై వేసుకున్నాడు. అక్కడే ఉంటే ప్రాణాలు దక్కవని అర్ధం చేసుకున్న ఆ నలుగురు మిత్రులు చీకటి లోనే దారీ తెన్ను కనిపించని పరిస్థితిలో చెల్లాచెదురై, వెనక్కి తిరిగి చూడకుండా కోట బయటకి పరుగు తీశారు. మెట్ల దగ్గరికి రాగానే రామ్ మోహన్ ఆయాసంతో ఆగిపోయాడు. భుజంపై ఉన్న కనకాచారి శరీరం అంతకంతకీ బరువు పెరిగిపోతుంది. జరిగిన ఈ భీభత్స సంఘటనలు చూసిన భయ, విహ్వలతల మధ్య అతని చేతిలోని టార్చ్ జారి ఎక్కడో దూరంగా పడిపోయింది. తనతో వచ్చిన మిత్రులు ఎటువైపు వెళ్లారో అర్థం కాలేదు. అంతా చిమ్మ చీకటి.. కళ్ళు చిట్లించుకొని చూసినా ఎదురుగా ఏమి కనిపించడం లేదు. రామ్మోహన్ నిలబడి ఉన్న ప్రదేశం అంతా ఒక రకమైన కమురువాసనతో నిండిపోయింది. ఎవరో చెవిలో గుసగుసలు పెడుతున్నారు. ఎక్కడో దూరంగా ఎవరో యువతి నవ్వుతూ, వెంటనే ఏడుస్తున్న శబ్దాలు, ఎవరో సమీపంలో నడిచి వచ్చిన శబ్దం కలగాపులగంగా వినిపించడంతో రామ్మోహన్ భయంగా చుట్టూ చూసాడు. హఠాత్తుగా కోట గోడలోనుండి బయటకు చొచ్చుకొని వచ్చిన రెండు బలమైన నల్లటి చేతులు రామ్మోహన్ గొంతు గట్టిగా పట్టుకొన్నాయి.
(సశేషం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments