రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శని, ఆదివారం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి నష్టాన్ని నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. పండిన పంటలను సాధ్యమైనంత త్వరగా సేకరించి భద్రపరచాలన్నారు. కాగా బుధవారం కురిసిన వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న సహా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కురిసిన వానతో శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం వలస గ్రామంలో పిందె దశలో ఉన్న దానిమ్మ రాలిపోయింది. రూ.50 లక్షల వరకు నష్టపోయామని రైతులు చెబుతున్నారు. నేలకొరిగిన 30 ఎకరాల పంట: నంబుల పూలకుంట మండలంలో మొక్కజొన్న పంట దెబ్బతింది. 30 ఎకరాల పంట నేలకొరిగినట్లు రైతులు తెలిపారు. బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లో చీనీ, అరటి, బొప్పాయి, మొక్కజొన్న, దోస పంటలు దెబ్బతిన్నాయి. సీకే పల్లి మండలం గంగినేపల్లిలో 53 ఎకరాల్లో మామిడి పంట నేల రాలడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గంగినేపల్లి, బ్రాహ్మణపల్లిని సందర్శించిన అధికారులు నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కడప జిల్లా పులివెందుల మండలానికి చెందిన అరటి రైతులు నష్టపోయారు. ఇప్పటికే బాగా తక్కువ ధరలు పలుకుతుండగా అకాల వర్షం మరింత నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి గ్రామీణంలో చేతికొచ్చిన వరి పంట పాడైంది. బంధారపల్లి, రంగంపేట, కొట్టాల, పుల్లయ్యగారిపల్లి, కూచివారిపల్లిలో మామిడి, వరి, టమోటా దెబ్బతిన్నాయి. వడగళ్ల వాన నిలువునా ముంచిందని రైతులు వాపోతున్నారు.
