కుసుమ ఉమెన్స్ ఫ్యాషన్’ పేరిట సరికొత్త విప్లవం
– ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్న ఆదర్శ వనిత
ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగమని నిరూపిస్తోంది ఒక సామాన్య యువతి. తన స్వశక్తితో ఎదగడమే కాకుండా, తోటి మహిళలకు నైపుణ్యాలనే ఆయుధాలను అందిస్తూ ‘సాధికారత’కు నిలువెత్తు రూపంగా నిలుస్తోంది. ఆమే తగరపువలసలో ‘కుసుమ ఉమెన్స్ ఫ్యాషన్’ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న కాళ్ళ కుసుమ (30). ఏ ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కుసుమ ప్రయాణంపై ‘మహిళా దినోత్సవ ప్రత్యేక కథనం’.
– ఆలోచన చిన్నదే.. ఆశయం కొండంత…!
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కస్పా జగన్నాధపురం గ్రామంలో పుట్టి పెరిగిన కుసుమ, వివాహానంతరం భీమిలి ప్రాంతంలో స్థిరపడ్డారు. ఆమె భర్త భీమిలి విద్యుత్ సంస్థలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్న కుసుమ, మూడు సంవత్సరాల క్రితం “నేనెందుకు సమాజానికి ఉపయోగపడకూడదు?” అనే ఆలోచనతో ముందడుగు వేశారు. ఆ సంకల్పమే నేడు తగరపువలసలో వందలాది మందికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే
“కుసుమ ఉమేన్స్ ఫ్యాషన్ శిక్షణ” కేంద్రానికి పునాది వేసింది.
నైపుణ్యంతో ఆత్మవిశ్వాసం
టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, క్రాఫ్ట్ డిజైనింగ్‌లో కుసుమ అందిస్తున్న శిక్షణ కేవలం ఉపాధిని మాత్రమే కాదు, మహిళల్లో అపరిమితమైన ధైర్యాన్ని నింపుతోంది.
సాంకేతికతతో అనుసంధానం: కేవలం స్థానికంగానే కాకుండా, ఆన్‌లైన్ ద్వారా దూర ప్రాంతాల మహిళలకు సైతం క్లాసులు నిర్వహిస్తూ తన పరిధిని విస్తరించారు.
– సేవా దృక్పథం
ప్రతి క్లాసులోనూ పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా శిక్షణ అందిస్తూ తన సేవాభావాన్ని చాటుకుంటున్నారు. నామమాత్రపు రుసుముతో నైపుణ్యాలను నేర్పిస్తూ మహిళలను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నారు.
ప్రేరణాత్మక మాటలతో ధైర్యం..
కేవలం విద్యను నేర్పడమే కాకుండా, తన దగ్గరకు వచ్చే మహిళలకు ప్రేరణాత్మక మాటలతో ధైర్యం నింపడం కుసుమ ప్రత్యేకత. ఆమెకంటే వయస్సులో పెద్దవారు కూడా ఆమె మాటలకు ఎంతో విలువ ఇస్తూ గౌరవించడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, వాటిని అధిగమించి నేడు వేలాది మంది మన్ననలు పొందుతున్నారు.
ప్రశంసల వెల్లువ..
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మే కుసుమ చేస్తున్న కృషిని స్థానికులు, ప్రజాప్రతినిధులు మరియు రాజకీయ నాయకులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. “మహిళలు తమ ప్రతిభను నమ్ముకుని ముందడుగు వేయాలే కానీ, ఏ కష్టమైనా ఎదిరించాల్సిందే” అని నిరూపిస్తున్న కుసుమ వంటి యువతులు నేటి తరానికి నిజమైన రోల్ మోడల్స్ అని యువత భావిస్తున్నారు.

