Home Politics బూతులు–రప్పా రప్పా రాజకీయాలకు తావులేదు… నిబద్ధతే టీడీపీ దారి

బూతులు–రప్పా రప్పా రాజకీయాలకు తావులేదు… నిబద్ధతే టీడీపీ దారి

0

జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి
రాజకీయాల్లో అశ్లీల భాష, రప్పా రప్పా సంస్కృతికి తావులేదని, క్రమశిక్షణ–నిబద్ధతలే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి ఘాటుగా స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ ప్రతిష్టను కాపాడడమే కాకుండా, మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆదివారం రాజమండ్రి నగరంలోని చెరుకూరి గార్డెన్స్‌లో ఆయన జిల్లా అధ్యక్షుడిగా అత్యంత వైభవంగా ప్రమాణస్వీకారం చేయడం రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది. ఆయనతో పాటు జిల్లా కమిటీకి చెందిన 42 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై, టీడీపీ క్రమశిక్షణకు, ప్రజాపక్ష విధానాలకు బొడ్డు వెంకటరమణ నాయకత్వం బలమవుతుందని వ్యాఖ్యానించారు. రాజమండ్రి, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, గోపాలపురం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు, వెంకటరమణలతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరుకావడం రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర సీనియర్ నేతలు పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.
అంతకు ముందు బూరుగుపూడు నుంచి క్వారీ మార్కెట్ మీదుగా చెరుకూరి గార్డెన్స్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ నగరాన్ని కుదిపేసింది. పార్టీ జెండాలు, నినాదాలతో కార్యకర్తలు రహదారులపై కదిలి వచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో టీడీపీ రాజకీయంగా మరింత దూకుడుగా, క్రమబద్ధంగా ముందుకెళ్లనున్నదనే స్పష్టమైన సంకేతం వెలువడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version