Home Politics Andhra Pradesh బాధిత వర్గాల ప్రజలకు చేయూత ఇవ్వాలి

బాధిత వర్గాల ప్రజలకు చేయూత ఇవ్వాలి

0

అధికారులకు సూచించిన ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ప్రజల నుంచి మంగళవారం వినతులు స్వీకరించారు. భారీగా ఫిర్యాదుదారులు హాజరై తమ సమస్యలను వినిపించారు. వినతులను పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులకు వెంటనే పంపిస్తూ త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సంబంధిత సమస్యలే ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా హౌస్ సైట్లు, పట్టాలు, అసైన్డ్ భూములను ఇతరులు ఆక్రమించారంటూ బాధితులు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. భూముల ఆక్రమణలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భీమిలి, గాజువాక మండలాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిడిగట్టు, కొత్తవలస, భీమిలి ప్రాంతాల్లో ఎస్సీలు నివసించే ప్రాంతాలకు ముందుగా లేఅవుట్లు వేసి అడ్డుకున్న ఘటనలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలో దుకాణాలను నిష్పత్తి ప్రాతిపదికన ఎస్సీ లబ్ధిదారులకు కేటాయింపు చేయాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఆలస్యం చేయకుండా చెల్లించాలని ఆదేశించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు, దళిత కాంట్రాక్టర్లకు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పనుల్లో కోటా ఇవ్వడంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా చేపట్టే ఇంజనీరింగ్ పనుల్లో ఎస్సీ వర్గాలకు చెందిన గుత్తేదారులకు తగిన అవకాశాలు కల్పించాలని సూచించారు. సమాజంలోని బలహీన వర్గాల పట్ల అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించి, మంచి మనస్సుతో చేయూత అందించాలని కోరారు.
అనంతరం కృష్ణాపురం పాఠశాలను సందర్శించిన ఆయన, ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో విశాఖపట్టణం ఆర్డీవో సుధాసాగర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె. రామారావు, డీఎంహెచ్వో జగదీశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, బాధితులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version