కౌన్సిల్ లో తీర్మానం ఆమోదం చట్టవిరుద్ధం
ఎంపీ భరత్ పై భూ కబ్జా కేసు నమోదు చేయాలి
సహకరిస్తున్న కొందరు అధికారులపైనా చర్యలు చేపట్టాలి
రూ. 5 కోట్ల విలువ చేసే భూమి కాజేయడానికేనా మేయర్ ను మార్చారు
సంపదను సృష్టిసానని.. విశాఖ సంపదను చంద్రబాబు దోచుకుంటున్నారు
ఎమ్మెల్సీ, వైసీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి ధ్వజం
గీతం భూ ఆక్రమణపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ కు ఫిర్యాదు
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన గీతం యూనివర్శిటీ విశాఖలో 54.79 ఎకరాల భూమిని కబ్జా చేసి నిబంధనలను తుంగలోకి తొక్కి , చట్టవిరుద్దంగా క్రమబద్దీకరణను చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ, వైస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి డిమాండ్ చేసారు. ఈ మేరకు మరో ఎమ్మెల్సీ కుంభా రవి బాబు, మాజీ మేయర్ హరికుమారి, కార్పొరేటర్లు ఉరుకూటి రామచంద్రరావు, ఇమ్రాన్ ల బృందం రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ ను కలసి జీవీఎంసీ తీరుపై ఫిర్యాదు చేసారు. వైసీపీ నేతలు అందచేసిన ఫిర్యాదు సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు వరుదు కల్యాణి తెలిపారు. అనంతరం వరదు కల్యాణి మీడియాతో మాట్లాడుతూ, నిబంధనలకు వ్యతిరేకంగా, చట్టవిరుద్ధంగా, నియమాలను ఖాతరు చేయకుండా గీతం కోసం కౌన్సిల్ లో చేసిన తీర్మానం చెల్లుబాటు కాదని స్పష్టం చేసారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రూ. 5 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి విశాఖ ఎంపీ, గీతం అధినేత భరత్ క్రమబద్దీకరణ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుడైన భరత్ బహిరంగంగా బరి తెగించి భూమిని కబ్జా చేయడమే కాకుండా క్రమబద్దీకరణ చేసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. సంపదను సృష్టిస్తానని పదే పదే ప్రకటించే చంద్రబాబు చివరకు విశాఖ ప్రజల సంపదను దోచుకుంటున్నారని, విశాఖను ఫైనాన్షియల్ కేపిటల్ చేస్తానని ప్రకటించే చంద్రబాబు, ఇప్పుడు దోపిడీకి కేపిటల్ చేసారని ఎద్దేవా చేసారు. గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసిన భరత్ కు ప్రజలు ఐదు లక్షల మెజార్టీ ఇస్తే గెలిచిన తర్వాత ఐదు వేల కోట్ల విలువైన భూమిని రిటర్న గిఫ్ట్ గా ప్రజల నుంచి దోచుకుంటున్నారని వరదు కల్యాణి ఆక్షేపించారు. రోడ్డుపైన చిన్న చిన్న వ్యాపారాలను చేసుకునే వారిని బుల్డోజర్ తో బెదిరించి తొలగించడం, ప్రభుత్వ భూముల్లో వలస పేదలు చిన్న గుడిసెలు వేసుకుంటే అక్రమమంటూ బలవంతంగా పీకి పారేస్తున్నారని, కానీ ఇప్పుడు పేదలకు ఒక న్యాయం.. చంద్రబాబు కుటుంబీలకు మరోక న్యాయమా అని ప్రశ్నించారు.
ఎంపీ భరత్ పై భూ కబ్జా కేసు పెట్టాలి
సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో రుషికొండపై ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు నిర్మించారని, అదే రుషికొండ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులైన చంద్రబాబు కుటుంబీకులు దోచుకుంటుంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు అని వరదు కల్యాణి నిలదీసారు. ప్రభుత్వ భూమి ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని 2012 లో ప్రభుత్వం జీఓ ఇచ్చిందని, అలాగే 2012లో స్థానిక సంస్థల అధీనంలోని భూమి ప్రైవేటుకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఆన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసిందని ఈ సందర్భంగా వరదు కల్యాణి ప్రభుత్వానికి గుర్తు చేసారు. ఈ నిబంధనలను పాటించకుండా, సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా భరత్ నడుపుతున్న గీతం విద్యాసంస్థలకు విలువైన భూమి కేటాయించడానికి అధికారులు ఎందుకు సహకరిస్తున్నారో తెలపాలన్నారు. తెలంగాణలో గీతం సంస్థ రూ. 118 కోట్ల విద్యుత్ బిల్లు ఎగనామం పెట్టగా, విశాఖలో రూ. 5 వేల కోట్ల భూమిని కాజేస్తూ బరితెగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూమి తమ అధీనంలో ఉందని, తాము కబ్జా చేసానని చెబుతున్న ఎంపీ భరత్ పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని విశాఖ కలెక్టర్ ను, జీవీఎంసీని వరదు కల్యాణి డిమాండ్ చేసారు.
మేయర్ పై అవిశ్వాసం ఇందుకోసమేనా..?
జీవీఎంసీలో వైసీపీకి చెందిన బీసీ మహిళ మేయర్ హరికుమారి ఉన్న సమయంలో అడ్డగోలుగా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెని పదవిచ్యుతురాలని చేసారని, చట్టవిరుద్ధంగా కూటమి మేయర్ పదవిని కాజేసినది ఇలాంటి కబ్జాలు చేయడానికేనా అని వరదు కల్యాణి ధ్వజమెత్తారు. జీవీఎంసీ కౌన్సిల్ లో గీతంకు భూమి క్రమబద్దీకరణపై ఎజెండాలో పెట్టిన అంశంపై వైసీపీ సభ్యుల చేసిన ఆందోళనలు, నిరసనలు అణిచి వేసి గందరగోళం సృష్టించి టీడీపీ మేయర్ ఆమోదించటం చట్టవిరుద్దమని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి అత్యంత విలువైన రూ. 5 కోట్ల విలువైన భూమిని క్రమబద్దీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రానున్న రోజుల్లో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళతామని వరుదు కల్యాణి స్పష్టం చేసారు. వైసీపీ గత కొన్నాళ్లుగా చేస్తున్న ఉద్యమానికి ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నారని వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కబ్జాలకు సహకరించిన అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామిని, అదే విధంగా కబ్జా చేసిన ఎంపీ భరత్ ను చట్టప్రకారం శిక్షించి ల్యాండ్ ను వెనక్కి తీసుకుంటామని వరుదు కల్యాణి ఉద్ఘాటించారు.
