Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradesh6 మాసాల కిందట సంఘటన...ఇప్పుడా విచారణ..!

6 మాసాల కిందట సంఘటన…ఇప్పుడా విచారణ..!

నవ్వుల పాలవుతున్న కేజీహెచ్ అధికారుల తీరు
` పోస్టింగ్ ఓఎస్…చేయించేది సంబంధం లేని ఎమ్మార్వో
` వింత పోకడలతో రోడ్డున పడుతున్న ఆస్పత్రి పరువు

కేజీహెచ్ అధికారుల తీరు వేరేగా చెప్పక్కర్లేదు. అక్కడ ఎవరి పోస్టును వారిని చేయనివ్వరన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడి ఉన్నతాధికారులను శాంతింపజేయనిదే కుదురుగా ఉద్యోగం కూడా చేసుకోనివ్వరన్న ఉదంతం తాజాగా బహిర్గతమవుతోంది. ఇప్పటి వరకూ గుట్టుగా కేజీహెచ్ కార్యాలయానికే పరిమితమనుకున్న ఈ అంశం ఇప్పుడు నాలుగు గోడలు దాటి బహిర్గతమైంది. అందుకు అతి తెలివితో ఉన్నతాధికారులు చేసుకున్న పాపమే పండిందని అక్కడి ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ఆరు మాసాల కిందట ఓ ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్/ అకౌంటెంట్‌గా కేజీహెచ్‌లో నియమితులయ్యారు. అయితే కొద్ది కాలానికే అతన్ని మెడికల్ రికార్డ్స్ అధికారి(ఎమ్మార్వో)గా బదిలీ చేసేశారు. వాస్తవానికి ఆ ఎమ్మార్వో పోస్టుకు మెడికల్ రికార్డ్స్‌లో శిక్షణ పొందిన ఉద్యోగులను నియమించాలి. కానీ అలాంటి ఉద్యోగులు దొరక్క ఈ సూపరింటెండెంట్‌ను అక్కడ నియమించారు. అయితే ఆ తర్వాత తెలిసిందేమంటే అకౌంటెంట్‌గా సదరు అధికారి ఉంటే తమ పప్పులుడకవని భావించిన కేజీహెచ్ అధికారిక వర్గాలు గుట్టు చప్పుడు కాకుండా బదిలీ చేసేశారు. అయితే ఇప్పుడు జయ జయహే పత్రికలో కేజీహెచ్ లో జరుగుతున్న అవినీతి అక్రమ దందాల వార్తలు నిత్యం వస్తుండడంతో ఈ మొత్తం నెపాన్ని ఆయనపై నెట్టేసి ఆ సదరు అధికారిని బలిపశువు చేసేసి తమ చేతులు దులిపేసుకుందామన్న కుట్రలో భాగంగా ఇటీవల ఓ ఫిర్యాదును అక్కడి మినిస్టీరియల్ ఉద్యోగులు కేజీహెచ్ సూపరింటెండెంట్‌కు అందించారు. ఆ వెంటనే ఆఘమేఘాల మీద సదరు అధికారిపై విచారణకు ఆంధ్రా వైద్య కళాశాలకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ను నియమించారు. ఆ విచారణ మంగళవారం జరుగనుంది. అందుకు అంతా హాజరు కావాలని ఆయన నోటీసు జారీ చేశారు. ఇదిలా ఉంటే…అసలు ఇంతకీ ఆ ఫిర్యాదు ఏంటో…మూకుమ్మడిగా ఇచ్చిన ఆ ఫిర్యాదులో ఏముందో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారికి ప్రజాస్వామ్యబద్దంగా తెలియజేయాల్సి ఉంటుంది. కానీ అదేమీ లేకుండా విచారణకు హాజరు కావాలంటూ ఏక పక్షంగా నోటీసలు జారీ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. నర్సుగా ఎవరైనా పోస్టింగ్ ఆర్డర్‌తో వస్తే ఆమె సేవలు ఇతరులకు గానీ, రోగికి కానీ నచ్చకపోతే ఆమెకు సంబంధం లేని టైపిస్టుగానో…రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గానో ఉద్యోగం చేయమంటారా…అలా చేయమన్నలేనప్పుడు ఎకౌంటెంట్‌గా ఆర్డర్‌తో వచ్చిన సదరు అధికారిని మెడికల్ రికార్డ్సు అధికారిగా ఎలా నియమించారో అందుకు ఎవరి ప్రోద్భలం ఉందో జిల్లా అధికారులకే తెలియాలి. పైగా ఎప్పుడో జరిగిన సంఘటనలన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుని సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడం వెనుక మతలబు ఏంటో నిఘా వర్గాలు వెలికి తీయాలి. సామరస్యపూర్వకంగా విధులు నిర్వర్తించాల్సిన చోట ఈ గందరగోళ పరిస్థితులకు కారకులెవరో నిగ్గు తేల్చాలి. అంతే గానీ దున్న ఈనిందంటే…దూడను కట్టెయ్యండ్రా అన్నట్టుగా కేజీహెచ్ ఉన్నతాధికారుల తీరుందని ఆ కార్యాలయం గురించి తెలిసిన వారంతా నవ్వుకుంటున్నారు. పైగా ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయిలో ఉండాల్సిన ఎకౌంటెంట్ పోస్టును ఇప్పుడు అంతకన్నా తక్కువ ీVAదా గల వ్యక్తితో చేయించడం వెనుక కాసుల కక్కుర్తి కాకపోతే మరేంటి అని అంతా అనుకుంటున్నారు. ఇంటి గుట్టు…లంక చేటు అన్నట్టు కేజీహెచ్ పరువు మొత్తం రోడ్డున పడేస్తున్న క్షణం తీరిక లేని ఆ ఉన్నతాధికారి తీరు పై జిల్లా అధికారులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments