Saturday, April 18, 2026
HomeSpl Storiesశవ యాత్ర... చచ్చేంత కష్టం...!

శవ యాత్ర… చచ్చేంత కష్టం…!

  • •⁠ ⁠అంత్యక్రియలు చేయడానికి ఎన్ని పాట్లో…!
    •⁠ ⁠వడ్డాది రెల్లి వీధిలో శవ యాత్ర

మనిషి చనిపోతే…ఆ శవాన్ని తీసుకుని అంత్యక్రియలు చేయడానికి ఎన్ని కష్టాలు పడతారో…కానీ అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది రెల్లి వీధిలో అయితే మరీ దారుణమైన పాట్లు పడతారు. ఎవరైనా మృతి చెందితే ఆ శవాన్ని పట్టుకుని అంతిమ యాత్ర చేయాలంటేనే అక్కడి కుటుంబీకులు వణికిపోతున్నారు. అంత్యక్రియలు చేయడానికి ఎన్ని పాట్లు పడాలో అన్నీ పడతారు అక్కడి ప్రజలు. ఈ ఘటనలు అక్కడ నిత్యం మామూలే అయినా శవంతో ఆయా కుటుంబీకులు…గ్రామస్తులు పడే పాట్లు చూస్తుంటే…ఎంతటి వారైనా కన్నీటిపర్యంతమవ్వాల్సిందే. దేవుడా ఇలాంటి బాధలు పగోడికి కూడా రాకూడదని దైవాన్ని వేడుకోని వారుండరంటే నమ్మండి.

మనిషి బ్రతికున్నప్పుడు లేని కష్టాలు చనిపోయాకే మొదలవుతాయని ఆ గ్రామంలో ఎవరిని పలకరించినా ఇట్టే చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

తాజా సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వడ్డాది రెల్లి వీధికి చెందిన రెల్లి అప్పలమ్మ ఆదివారం మృతి చెందింది. ఆమె ఇంటి నుంచి స్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు దాదాపు రిలోమీటర్‌ మేర శవంతో అంతిమ యాత్ర చేయడానికి ఆ గ్రామ ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. ఆ స్మశాన వాటికకు వెళ్లాలంటే శారదా నది దాటాల్సి ఉంది. ఆ నదిలోంచి మృత దేహాన్ని మోసుకుంటూ దాటించడమే పెద్ద కష్టం. ఆ నదిపై కొన్ని చోట్ల తాటి దొక్కలే మార్గంగా ఉంది. ఆ మార్గంపై నుంచి ఒక్కొక్కరూ నడవాలి. కానీ ఇలా శవంతో నడవాలంటే అయ్యే పని కాదు.

ఒక వైపు నదిలోకి దిగి నడుస్తుంటే…మరి కొందరు ఈ తాటి దొక్కలపై నడవాల్సిన పరిస్థితి. ఇలా నడిస్తే మృతదేహం ఏదో వైపు ఒరిగిపోయి నీటిలో ఎక్కడ పడిపోతుందోనన్న భయం మరో పక్క. ఇలా నానా పాట్లు పడి అంతిమ యాత్ర చేస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ సంగతి తెలిసినా ఏ మాత్రం చలనం లేకుండా ఉండడంతో చచ్చిన వాళ్లతో మాకు చచ్చేంత పని అంటూ ఆ గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శ్మశాన వాటికకు మార్గం సుగమం చేయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments