అంతర్జాతీయ వేదికగా విరాజిల్లుతున్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరం,దేశ–విదేశీ కళల సంగమంగా మూడో రోజుకు చేరిన ‘భారత్ రంగ్ మహోత్సవం, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సహకారంతో, యడ్లపాడు వేదిక ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘భారత్ రంగ్ మహోత్సవం’ మూడో రోజుకు చేరుకుని కళాప్రియులను మంత్రముగ్ధులను చేస్తూ విజయవంతంగా కొనసాగుతోంది.
వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు సారధ్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ నాటకోత్సవాలు, తెలుగు నాటక రంగానికి కొత్త జవజీవాలను అందిస్తూ… గుంటూరును ఒక సాంస్కృతిక రాజధానిగా నిలబెడుతున్నాయి. దేశ–విదేశీ భాషలు, విభిన్న కళారూపాల సమ్మేళనంగా సాగుతున్న ఈ వేడుకలకు ప్రముఖ రచయితలు, కళాసంస్థలు, నాటక పరిషత్ నిర్వాహకులు, వేలాదిమంది కళాకారులు తరలివచ్చి కళామాతకు నీరాజనాలు అర్పిస్తున్నారు.
*మువ్వల సవ్వడి… జానపద కేళీ… విద్యార్థి గళాన కొండవీడు కావ్యం*
ఆదివారం మధ్యాహ్నం నుంచే శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంగణం సాంస్కృతిక జాతరను తలపించేలా కళా సందడితో కళకళలాడింది.
బళ్లారి రాఘవయ్య ఓపెన్ థియేటర్ వేదికగా పాటలు, ఆటలు, కోలాటాలు, చెక్కభజనలు, డప్పు వాయిద్యాల విన్యాసాలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి.
చిలకలూరిపేట నవదుర్గా నాట్య ధార్మిక బృందం ప్రదర్శించిన శాస్త్రీయ–జానపద నృత్యాలు ఆకట్టుకోగా,
నరసరావుపేట ఉపాధ్యాయుల సంఘం వారి కోలాట ప్రదర్శన ప్రేక్షకులను అబ్బురపరిచింది.
ముఖ్యంగా యడ్లపాడు నారాయణ పాఠశాల విద్యార్థులు కొండవీడు చారిత్రక ఘట్టాలను వివరిస్తూ పాడిన ప్రత్యేక గీతం శ్రోతలలో చారిత్రక స్ఫూర్తిని నింపింది.
అమరావతి అమరేశ్వర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ, గుంటూరు దుర్గా ప్రసాద్ అకాడమీ కళాకారుల శాస్త్రీయ, జానపద అభినయాలు వేదికకు మరింత రమణీయతను చేకూర్చాయి.
*భాష వేరైనా భావం ఒక్కటే… సామాజిక మథనంపై కన్నడ కంచుకాగితం*
సాయంత్రం వేళ వెలుగుల మధ్య ప్రారంభమైన సభా కార్యక్రమం తెలుగు నాటక రంగ అభివృద్ధికి ఒక ప్రతీకగా నిలిచింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో నాటక రంగాన్ని బతికిస్తూ ముందుకు నడిపిస్తున్న వివిధ కళాపరిషత్ నిర్వాహకులను ఘనంగా సత్కరించడం నిర్వాహకుల సంస్కారానికి నిదర్శనంగా నిలిచింది.
అనంతరం కర్ణాటకకు చెందిన నటమిత్రాలు హవ్యాసి కళా సంఘం, తిరుత్తహల్లి వారు ప్రదర్శించిన
‘ఆ వూరు – ఈ ఊరు’ కన్నడ నాటకం నాటకోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
పల్లెటూరు–కుటుంబ నేపథ్యంతో సమాజంలోని లోపాలను నిర్భయంగా ప్రశ్నిస్తూ, ప్రేక్షకులను ఆలోచనల లోకంలోకి తీసుకెళ్లిన ఈ నాటకం
జి.బి. జోషి రచన కాగా, హుళుగప్ప కట్టిమాని దర్శకత్వం వహించారు.
పూర్తి కన్నడ భాషలో ప్రదర్శించినప్పటికీ కళాకారుల హావభావాలు, అభినయాలు భాషా అవరోధాలను చెరిపివేస్తూ ప్రేక్షకులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చాయి.
*తెలుగు నేలపై అంతర్జాతీయ రంగస్థల పండుగకు అపూర్వ స్పందన*
అంతర్జాతీయ స్థాయి నాటకాలను తెలుగు నేలపైకి తీసుకువచ్చి, గుంటూరు గడ్డపై అపూర్వ నిర్వహణతో ముందుకు సాగుతున్న డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబును కళాకారులు, ప్రేక్షకులు హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు.
‘భారత్ రంగ్ మహోత్సవం’ గుంటూరు నగరాన్ని సాంస్కృతిక కేంద్రంగా నిలిపే దిశగా ఒక చారిత్రక అడుగుగా కళావర్గాలు కొనియాడుతున్నాయి.
——
