Sunday, May 3, 2026
HomePoliticsAndhra Pradeshబీసీలను అణిచివేయడానికే కూటమి ప్రభుత్వం పనిముట్ల రాజకీయాలు: మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్

బీసీలను అణిచివేయడానికే కూటమి ప్రభుత్వం పనిముట్ల రాజకీయాలు: మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్

బీసీలను పాత వృత్తుల్లోనే పరిమితం చేసి అణిచివేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పనిముట్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతోందని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆధునిక కాలంలో బీసీ యువత రాజకీయ, వాణిజ్య, ఐటీ రంగాల్లో ఎదగాలని ఆశిస్తున్న సమయంలో ఈ విధమైన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని ఆయన అన్నారు.
సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు, లోకేష్‌ల వ్యాఖ్యలు అగ్రవర్ణ దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు. బీసీ, ఎస్సీ మహిళలకు 50 సంవత్సరాల తర్వాత పెన్షన్, నిరుద్యోగ భృతి, ఇంటి స్థలాల వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి రుణాలు మంజూరు చేయాలని కోరారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ, ఎస్సీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యాసంస్థల ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వం హయాంలో ‘నాడు-నేడు’ ద్వారా వేలాది ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీనపరుస్తూ ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
2019-24 మధ్య కాలంలో 59కు పైగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని, రాజ్యసభలో కూడా వారికి స్థానం కల్పించామని తెలిపారు. బీసీలు ఆత్మగౌరవంతో జీవించిన కాలం జగన్ పాలనలోనే వచ్చిందని పేర్కొన్నారు.
ఆదిరెడ్డి అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని భరత్ డిమాండ్ చేశారు. గతంలో కూడా ఆయన ప్రవర్తన వివాదాస్పదమైందని గుర్తుచేశారు. ఒక కుటుంబ వివాదంలో దళితుడిని దూషించడం, దాడి చేయడం వంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
బాధితుడు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా, అతడిపైనే కేసు పెట్టడం అన్యాయమని విమర్శించారు. ఈ విషయంలో న్యాయం జరగకపోతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
నగరంలో మహిళల భద్రతపై మాటలు చెప్పే నాయకుల కుటుంబ సభ్యులే మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు. అలాగే ఇసుక, మద్యం, పేకాట వంటి అక్రమ కార్యకలాపాల్లో కొందరు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు.
రాష్ట్రంలో జరుగుతున్న వివిధ సంఘటనలను వైసీపీపై మోపడం ప్రభుత్వానికి అలవాటైందని, ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని భరత్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments