Sunday, April 26, 2026
HomePoliticsAndhra Pradeshతెలుగు సెలబ్రిటీ క్రికెట్ పండుగ

తెలుగు సెలబ్రిటీ క్రికెట్ పండుగ

పోస్టర్ ను విడుదల చేసిన గంటా, వంశీ

మధురవాడ ఏసీఏ – వీడీసీఏ స్టేడియంలో ఈనెల 29, మార్చి 1 వ తేదీల్లో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. హోటల్ మేఘాలయలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ ఎమ్మెల్యే సీహెచ్. వంశీకృష్ణ శ్రీనివాస్ తో కలిసి క్రికెట్ పోటీల వివరాలను ఆయన వెల్లడించారు. తెలుగు నటులు, టీవీ నటులతో రెండేసి టీంలు.. పోలీసులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులతో ఒక్కో టీం చొప్పున మొత్తం 7 టీంల నుంచి 110 సెలబ్రిటీలు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ మ్యాచ్ ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద పిల్లల చదువు, సీఎం సహాయ నిధి, దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తారని పేర్కొన్నారు. విశాఖను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్ గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందన్నారు. కొమ్మాదిలో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, దివ్యాంగుల ప్రత్యేక స్టేడియం అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత బీసీసీఐ సహకారంతో మధురవాడ క్రికెట్ స్టేడియంలో వసతులు ఎంతగానో మెరుగుపరిచారని.. వన్డే, టీ20, ఐపీఎల్ మ్యాచ్ ల కేటాయింపులో విశాఖకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రెండు రోజుల పాటు అలరించనున్న సెలబ్రిటీ లీగ్ ను వీక్షించే అవకాశాన్ని విశాఖ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. భోగాపురం ఎయిర్ పోర్టు కార్యకలాపాలు మొదలైన తర్వాత విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, 7 మాస్టర్ ప్లాన్ కనెక్టింగ్ రోడ్లు ఈ ఏడాది జూన్ లోపు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. సెలబ్రిటీ లీగ్ నిర్వాహకుడు రాంబాబు మాట్లాడుతూ క్రికెట్ పోటీల నిర్వహణలో వెన్నంటి ఉండి నడిపిస్తున్న ఎమ్మెల్యే గంటా సూచనతో ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించామని తెలియజేశారు. ఐపీఎల్ తరహాలో సెలబ్రిటీ మ్యాచ్ లను డిజైన్ చేశామన్నారు. తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోస్టర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు. వ్యాపారవేత్తలు కంకటాల మల్లిక్, పైడా కృష్ణప్రసాద్, కాశీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments