నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని, గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇటీవల ఒక టీవీ ఛానెల్‌లో ప్రసారమైన కథనాలపై స్పందిస్తూ .
మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, గత 22 నెలల కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు రూ.500 కోట్లకు పైగా నిధులను సమీకరించినట్లు తెలిపారు. 2019 నుండి 2024 మధ్య రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని, ప్రస్తుతం ఆర్ అండ్ బి మరియు గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో సుందరీకరించేందుకు కౌన్సిల్ సభ్యులు, చైర్మన్ సహకారంతో చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
రాజకీయ విమర్శలపై స్పందిస్తూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాను నిడదవోలు నుండి పోటీ చేశానని, ఆయన చూపిన మార్గంలో క్రమశిక్షణతో పనిచేస్తానని స్పష్టం చేశారు.
తనపై మరియు ప్రభుత్వంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి ఆరోపణలను ప్రజలు నమ్మరని అన్నారు. వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్న కథనాలకు ఎటువంటి ప్రాధాన్యం లేదని కొట్టిపారేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో నిడదవోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని మంత్రి కందుల దుర్గేష్ పునరుద్ఘాటించారు.
