తాటిపాక మధు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను మున్సిపల్ కార్మికులంతా జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. గురువారం రాజమహేంద్రవరం లో మున్సిపల్ అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ కాలంలో కార్మికులు పోరాటాలతో సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ద్వారా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. బడా కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం కార్మికులను మళ్లీ బానిస వ్యవస్థ వైపు నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 60 ఏళ్లు నిండగానే ఉద్యోగాలు కోల్పోతున్న కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని, అకాల మరణంతో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఉపాధి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12న జరిగే సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
