Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshసునేత్ర పవార్ కు ఎన్సీపీ పగ్గాలు..?

సునేత్ర పవార్ కు ఎన్సీపీ పగ్గాలు..?

డిప్యటీ సీఎంను చేసేందుకు సిద్ధం.పార్టీ నేతలందరిలో ఏకాభిప్రాయం,మహారాష్ట్ర దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఎన్​సీపీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జనవరి 31న ఎన్​సీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆమెను తమ నేతగా ఎన్నుకోనున్నట్లు మంత్రి ఛగన్ భుజ్‌బల్ తెలిపారు. ముంబయిలోని పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సునేత్ర పవార్‌ను ఉపముఖ్యమంత్రిగా చేసేందుకు పార్టీలో ఏకాభిప్రాయం ఉందని భుజ్‌బల్ పేర్కొన్నారు. శాసనసభా పక్షం నిర్ణయం తీసుకుంటే, శనివారమే ఆమె ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా తమకు అభ్యంతరం లేదని సీఎం దేవేంద్ర ఫడణవీస్​ చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
“శనివారం ఎన్‌సీపీ శాసనసభా పక్ష సమావేశంలో సునేత్ర పవార్‌ను మా నాయకురాలిగా ఎన్నుకుంటాం. ఆమె డిప్యూటీ సీఎం కావాలని చాలా మంది నాయకులు కోరుకుంటున్నారు” అని భుజ్‌బల్ విలేకరులకు తెలిపారు. ఖాళీ అయిన శాసనసభా పక్ష నేత పదవిని, డిప్యూటీ సీఎం పదవిని భర్తీ చేయడం ఇప్పుడు అత్యంత ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరేలు సంతాప దినాలకు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు. సాధారణంగా సంతాప దినాలు మూడు లేదా పది రోజులు ఉంటాయి. నిబంధనలను బట్టి ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండాలనేది నిర్ణయిస్తారు. కానీ నాయకురాలి ఎంపిక మాత్రం రేపే జరగనుంది. ఎన్‌సీపీ ముఖ్య నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తత్కరే, ధనంజయ్ ముండే తదితరులు శుక్రవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ను కలిశారు. ఆయన నివాసంలో సుమారు గంట సేపు చర్చలు జరిపారు. తదుపరి కార్యాచరణపై, ప్రభుత్వంలో మార్పులపై చర్చించారు. ఎన్‌సీపీ తీసుకునే ఏ నిర్ణయానికైనా తన మద్దతు ఉంటుందని ఫడణవీస్​ హామీ ఇచ్చినట్లు భుజ్‌బల్ తెలిపారు. బారామతి అసెంబ్లీ స్థానం అజిత్ మరణంతో ఖాళీ అయ్యింది. సునేత్ర ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు కాబట్టి, ఆమె ఆ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

అజిత్ వర్గం మౌనం..
అజిత్ పవార్ వర్గ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే వంటి నేతలు విలీనంపై ఇప్పుడే మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు. “విలీనంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మా ప్రాధాన్యత ఖాళీని భర్తీ చేయడమే. అంత్యక్రియల తంతు ముగిశాక పవార్ కుటుంబంతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం” అని ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. సునేత్ర పవార్‌కు రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె సీనియర్ నేత పద్మసింహ పాటిల్ కుమార్తె. 1991లో శరద్ పవార్ కేంద్రానికి వెళ్లడానికి అజిత్ ఎలా త్యాగం చేశారో, ఇప్పుడు సునేత్ర కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నారు. “తదుపరి ఏం చేయాలనేది పవార్ కుటుంబమే నిర్ణయిస్తుంది” అని జయంత్ పాటిల్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments