గత మూడు దశాబ్దాలుగా 16,000 మంది అనాధ, పేద బాల బాలికలను చేరదీసి వాళ్లను పేదరికపు కోరల నుండి రక్షించి వాళ్ళ బంగారు భవిష్యత్తుకై బాటలు వేసిన హీల్ స్వచ్ఛంద సంస్థను పౌర సంస్థల ప్రతినిధులు సందర్శించి నిర్వాహకులను అభినందించారు.
ఈనెల 29వ తేదీన జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, చేయూత ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు టి. ధనుంజయ రెడ్డి, కార్మెల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జాక్ క్లమాకస్, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, వి ఆర్ విత్ యు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సిగినం అయ్యప్ప, కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు పటాన్ అల్లాబక్షు, అభినందన ఫౌండేషన్ వ్యవస్థాపకులు కె. నిర్మల్ కుమార్, కెబిఆర్ ఫౌండేషన్ ఫౌండర్ కె. బాలరాజు, విశ్రాంత అడిషనల్ ఎస్పీ కె.వి చలపతిరావు, సేవా తత్పరులు దంటు సాంబిరెడ్డి లతో కూడిన ప్రతినిధుల బృందం ఆగిరిపల్లి సమీపంలో తోటపల్లి నందు గల హీల్ పేరడైజ్ విలేజ్ ను సందర్శించి అక్కడున్న హీల్ హెల్త్ సెంటర్, హీల్ స్పోర్ట్స్ సెంటర్, హీల్ ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్, అలేఖ్య హీల్ ఏఐ సెంటర్ లను ప్రత్యక్షంగా వీక్షించి, వాటి ద్వారా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకుని హీల్ బృంద సభ్యులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా హీల్ పేరడైజ్ విలేజ్ నందుగల వెయ్యి మంది బాలబాలికల భోజనానికై చేయూత ఫౌండేషన్ నుండి 35 వేల రూపాయల ఆర్థిక విరాళాన్ని వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
హాజరైన పౌర సంస్థల ప్రతినిధులకు హీల్ సంస్థ నిర్వాహకులు కోనేరు లక్ష్మి, యార్లగడ్డ అంకమ్మ చౌదరి సంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి, భవిష్యత్తు కార్యచరణ గురించి వివరిస్తూ డాక్టర్ కోనేరు సత్య ప్రసాద్ వైద్య విద్యను అభ్యసిస్తుండగానే పదిమందితో ప్రారంభించిన సంస్థ నేడు వెయ్యి మందికి విద్యను, వైద్యాన్ని అందిస్తుందని, త్వరలో హీల్ యూనివర్సిటీ గా పురోగతి సాధించి రెండు లక్షల మంది అనాధ, పేద విద్యార్థుల భవిష్యత్తును నిర్మించే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు.
డా || కోనేరు సత్యప్రసాద్ 1967లో వైద్య విద్యను గుంటూరులో అభ్యసిస్తుండగానే ప్రజా సేవా సమితిని స్థాపించి అతి పేదలుగా ఉన్న అనాధ బాల బాలికలకు విద్యనందించడానికి కృషి చేశారన్నారు. ఇంగ్లాండ్ లో డాక్టర్ గా స్థిరపడిన తర్వాత హీల్ సంస్థను ప్రారంభించినారని వివరించారు. నేడు అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, కెనడా దేశాల నుండి దాతలు విరాళాలు అందిస్తున్నారని తెలిపారు.
‘హీల్’ను సందర్శించిన పౌర సంస్థల ప్రతినిధులు
RELATED ARTICLES
