Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshదివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి: పులిపాటి దుర్గారెడ్డి

దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి: పులిపాటి దుర్గారెడ్డి

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం రాజమండ్రి బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు కాలేదని ఆయన విమర్శించారు. గతంలో ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు అందుతుండగా, లక్షకు పైగా పెన్షన్లు తొలగించారని ఆరోపించారు. పెన్షన్ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచినట్లు ప్రకటించినప్పటికీ, అనేక మందిని అనర్హులుగా ప్రకటించడం అన్యాయమని అన్నారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ‘ఇంద్రధనస్సు 7 వరాలు’ పథకానికి తగిన బడ్జెట్ కేటాయించాలని కోరారు.
దివ్యాంగులకు హామీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వెంటనే అమలు చేయాలని, సదరం సర్టిఫికెట్‌ల జారీ ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
జిల్లా అధ్యక్షులు ముత్యాల పోసి కుమార్ మాట్లాడుతూ దివ్యాంగులపై దాడులు పెరుగుతున్నాయని, నిలిపివేసిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల నాగేంద్ర, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కొణతం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలాటి నాగరాజు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముత్యాల పోసి కుమార్, రాజమండ్రి అర్బన్ అధ్యక్షులు మహేష్, దివ్యాంగుల హక్కుల వేదిక గౌరవాధ్యక్షులు ముద్దాల అను, మహిళా నాయకురాలు సానబోయిన దుర్గ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments