సాంకేతిక రంగంలో భారత్ వేగంగా ముందుకు దూసుకుపోతున్నా, అదే వేగం సైబర్ నేరాల వ్యాప్తిలోనూ కనిపించడం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సైబర్ మోసాలు నమోదవుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలవడం మన డిజిటల్ ప్రగతికి మచ్చగా మారుతోంది. ఇటీవల కాలంలో ఆన్లైన్ నేరాల్లో “డిజిటల్ అరెస్ట్”, “సైబర్ స్టాకింగ్” వంటి మోసపు విధానాలు అత్యంత ప్రమాదకర రూపం దాల్చాయి. ఇవి వ్యక్తిగత ఆర్థిక భద్రతను మాత్రమే కాదు, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని, చట్ట అమలు వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని సైతం దెబ్బతీస్తున్నాయి.
నేరగాళ్లు ఇప్పుడు సాధారణ మోసగాళ్లు కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ సాంకేతికత, అధునాతన స్పైవేర్లను ఆయుధాలుగా మలచుకుని సామాన్యులపై దాడి చేస్తున్నారు. ఒక వ్యక్తి ముఖాన్ని అశ్లీల చిత్రాలకు అతికించి, అవి అసలైనవేనన్న భ్రమ కలిగించే డీప్‌ఫేక్ పద్ధతి బాధితులను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తోంది. ఈ దెబ్బల నుంచి కోలుకోవడం చాలామందికి సాధ్యంకాని స్థితికి చేరుతోంది.
డిజిటల్ అరెస్ట్ మోసాల్లో నేరగాళ్లు వీడియో కాల్స్ ద్వారా పోలీసులు లేదా దర్యాప్తు సంస్థల అధికారులుగా నటిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు. డ్రగ్స్ అక్రమ రవాణా లేదా మనీ లాండరింగ్ కేసుల్లో బాధితుల పేరు ఉందని నమ్మించి, లీకైన వ్యక్తిగత సమాచారంతో నమ్మకం పొందుతారు. నకిలీ ఐడీలు, అరెస్ట్ వారెంట్లు చూపిస్తూ గంటల తరబడి కాల్‌లోనే ఉంచి, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తారు. ఈ ఒత్తిడిలో తమను తాము రక్షించుకోవాలనే తాపత్రయంలో బాధితులు భారీ మొత్తాలను నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ఇది ఆర్థిక నష్టంతో ఆగకుండా, సామాజిక గౌరవాన్ని దెబ్బతీసి, కొందరిని ఆత్మహత్యల అంచుల వరకూ నెట్టేస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదిస్తున్న పరిష్కారాలు గమనార్హమైనవి. కేంద్ర హోంశాఖ పరిశీలిస్తున్న ‘కిల్ స్విచ్’ వ్యవస్థ ఒక అత్యవసర రక్షణ కవచంలా పనిచేస్తుంది. వినియోగదారుడు మోసానికి గురవుతున్నాననే అనుమానం కలిగిన వెంటనే, తన బ్యాంకు ఖాతాల నుంచి జరిగే అన్ని లావాదేవీలను తక్షణమే నిలిపివేయగల అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఇది అమలైతే, నేరగాళ్లకు అత్యంత కీలకమైన దశలోనే అడ్డుకట్ట వేయవచ్చు.
అలాగే ఆర్బీఐ ప్రతిపాదించిన ‘మోసాల బీమా వ్యవస్థ’ కూడా వ్యవస్థాపరమైన మార్పుకు సూచిక. మోసాలను కేవలం వ్యక్తిగత నిర్లక్ష్యంగా కాకుండా, ఒక సమగ్ర వ్యవస్థా ప్రమాదంగా గుర్తించాల్సిన అవసరాన్ని ఇది స్పష్టం చేస్తోంది. బ్యాంకులు, బీమా సంస్థలు కలసి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం ద్వారా బాధితులకు జరిగిన ఆర్థిక నష్టాన్ని కొంతైనా భర్తీ చేసే అవకాశం ఏర్పడుతుంది. 2024–25 నాటికి లక్షల కోట్ల రూపాయల విలువైన మోసాలు నమోదైన నేపథ్యంలో, ‘డిజిటల్ పేమెంట్ రక్షణ నిధి’ ఏర్పాటు అత్యవసరమని స్పష్టమవుతోంది.
సాంకేతిక పరిష్కారాలతో పాటు వ్యవస్థాగత మార్పులు కూడా అంతే కీలకం. డిజిటల్ అరెస్ట్ మోసాలపై దేశవ్యాప్తంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం సానుకూల సంకేతం. సైబర్ నేరాలకు రాష్ట్ర సరిహద్దులు లేనందున, కేంద్ర స్థాయిలో సమన్వయ దర్యాప్తు వ్యవస్థ అనివార్యం. సోషల్ మీడియా సంస్థలతో ప్రభుత్వాలు సమర్థవంతమైన ఒప్పందాలు చేసుకుని, అభ్యంతరకర కంటెంట్‌ను క్షణాల్లో తొలగించేలా చర్యలు తీసుకోవాలి. అప్రమత్తత, కఠినమైన చట్టాలు, వేగవంతమైన దర్యాప్తు—ఈ మూడింటి సమన్వయంతోనే సైబర్ నేరాల రాక్షసాన్ని కట్టడి చేయగలం. డిజిటలైజ్ అవుతున్న భారత ఆర్థిక వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, ఈ వినూత్న ఆలోచనలను అమలు చేసే సమయం ఇప్పుడే
(సి.హెచ్. ప్రతాప్)
