క్యాంపస్ లో నిత్యం అలజడి
కుల, మత రాజకీయాల ఉచ్చులో విద్యార్థి సంఘాలు
ఆర్ ఎస్సెస్ కు మద్దతుగా ఏబీవీపీ
దండెత్తుతున్న కమ్యూనిస్టు యూనియన్లు
రోడ్డెక్కిన ఆంధ్రాయూవిర్శిటీ ప్రతిష్ట
విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ పీస్ ఫుల్ కు కేరాఫ్ అడ్రస్.. మెస్ లో ఫుడ్ బాలేదనో.. బద్దింక పడిందనో, తేలు కనిపించందనో అడపాదడపా నిరసనలు మాత్రమే జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఈ యూనివర్శిటీలో రాజకీయ అలజడి సాగుతోంది. పొలిటికల్ కాంట్రవర్సికి సెంటర్ గా మారింది. అసలు ఏయూలో ఏం జరుగుతోందన్న చర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రయానివర్శిటీ చాలా ప్రత్యేకమైనది. ఎంతో చారిత్రిక నేపథ్యం ఉంది. బ్రిటీష్ కాలం నుంచి ఎందరో విద్యావంతులు ఈ క్యాంపస్ చదివి రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. అంతేకాదు చాలా రాజకీయ ప్రముఖులు కూడా విశాఖలోని ఏయూ క్యాంపస్ లో చదివి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాణించిన వారు ఉన్నారు. భారతదేశ మొదటి రాష్ట్రపతి సర్వేపల్లి రాథాకృష్ణ కూడా ఏయూ వైస్ చాన్సలర్ గా పని చేసిన వారే. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మొదలుకుని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు అనేక మంది ఏయూ స్టూడెంట్స్ నే. అయితే ఎంత గొప్ప యూనివర్శిటీ అయినా సరే చిన్న చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఏయూలో కూడా మెస్ చార్జీలు, నాసిరకం ఫుడ్.. టీచింగ్, నాన్ టీచింగ్ ఇష్యూలపై చిన్న చిన్న ఆందోళనలు.. నిరసనలు జరుగుతూ ఉంటాయి. అన్ని యూనివర్శిటీల తరహాలోనే ఏయూలో అప్పుడప్పుడు కొద్దిపాటి అంశాలపై నిరసనల పర్వం సాగుతూ ఉంటుంది.
అయితే ఇటీవల కాలంలో ఏయూ క్యాంపస్ చుట్టూ రాజకీయ ఉచ్చు బిగుసుకుందట. గత మూడు, నాలుగైదు రోజులుగా క్యాంపస్ లో కుల, మత పరమైన అలజడి రాజుకుంటోంది. ఈ వ్యవహారం కాస్తా యూనివర్శిటీ ప్రతిష్టకే భంగం కలిగించే స్థాయికి చేరింది. ఇటీవల కాలంలో ఆర్ ఎస్ ఎస్ కు చెందిన కొందరు కార్యకర్తలు క్యాంపస్ లోని వాలీబాల్ గ్రౌండ్ లో శాఖను నిర్వహించారు. అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ కు చెందిన సంప్రదాయ బద్ద దుస్తులు ధరించి నినాదాలు చేస్తూ ప్రార్థనలు సాగించారు. ఈ వ్యవహారం కాస్తా కమ్యూనిస్టు పార్టీలకు అనుబంధంగా ఉండే విద్యార్థి సంఘాల దృష్టికి వెళ్లింది. క్యాంపస్ లో ఆర్ ఎస్ ఎస్ కవాతు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ కావడంతో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీ క్యాంపస్ లో కుల, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటంటూ సీపీఎంకు అనుబంధంగా పని చేసే ఎస్ ఎఫ్ ఐ, సీపీఐకి అనుబంధంగా ఉన్న ఏఐఎస్ ఎఫ్ లు నిరసనలకు దిగాయి. దీంతో అర్ ఎస్ ఎస్ పట్ల సానుకూలంగా అఖిలభారత విద్యార్థి పరిషత్ రంగంలోకి దిగింది. ఎస్ ఎఫ్ ఐ, ఎఐఎస్ ఎఫ్ చేస్తున్న ఆందోళనలకు కౌంటర్ గా క్యాంపస్ లో దిగి పోటాపోటీగా నివాదాలు చేస్తూ హోరెత్తించారు. దీంతో ప్రశాంతంగా ఉండే క్యాంపస్ కాస్తా నిరనసలతో అట్టుడుకేలా మారిపోయింది.
మరోవైపు ఆంధ్రా యూనివర్శిటీని ఆనుకుని ఉన్న సాగరం వేదికగా దేశ, విదేశాలకు చెందిన నౌకాదళాలతో కూడిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని, సుప్రీం కమాండర్ గా ఉన్న రాష్ట్రపతి ద్రౌపది మర్ము సమీక్ష చేస్తుండగా, ఇదే సమయంలో ఏయూలో విద్యార్థులు రచ్చకెక్కారు. రిజిస్ట్రార్ కార్యాలయంను చుట్టుముట్టి రణరంగం తలపించేలా నానా రభస చేసారు. ఇటు ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ ఎఫ్ ఓ వైపు, అటు ఏబీవీపీ విద్యార్థులు ఒకో చోటకు చేరి పరస్పర దూషణలతో చాలా హంగామా చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టి వెనక్కి పంపేసి, కేవలం స్టూడెంట్ లీడర్స్ మాత్రమే చర్చలకు పిలిచారు. రిజిస్ట్రార్ విద్యార్థి సంఘ నేతలతో చర్చించి ఎప్టిలానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపించేసారు. అయితే ఈ అలజడికి మూలకారణమైన ఆర్ ఎస్ ఎస్ కవాతు వ్యవహారం అ్రన్నిరాజకీయవర్గాల్లో ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వకాలంలో భారతీయ విద్యాకేంద్రాల పరిధిలోనే శాఖలను నిర్వహించుకునేవి. తర్వాత కాలంలో ఆర్ ఎస్ ఎస్ వ్యవహారాలు విశాఖలో కనుమరుగయ్యాయి. ఎప్పుడో ఏడాదికోసారి మాత్రమే సంఘ ర్యాలీలు నిర్వహిస్తూ ఊనికి చాటుకుంటూ ఉంటారు. అలాంటిది హఠాత్తుగా ఇప్పుడు చారిత్రాత్మక ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ లో కవాతు శాఖను నిర్వహించడం వెనుక వ్యూహం ఏమిటన్నది చర్చకు దారి తీస్తోంది. విశ్వవిద్యాలయాల పరిధిలో కుల, మత పరమైన వ్యవహారాలు నిర్వహించరాదని కొఠారి కమిషన్, యశ్పాల్ కమిటీలు సూచించడంతో పాటుగా ఇవి కుల, మత విద్వేషాలకు దారితీసే రాజకీయాలకు తావు ఉండరాదని అప్పట్లోనే హెచ్చరికలు కూడా జారీ చేసింది. మరి ఇవన్నీ తెలిసి కూడా ఆర్ ఎస్ ఎస్ ఏయూ క్యాంపస్ లో శాఖ ను నిర్వహించిందంటే ఉద్దేశ్యపూర్వకంగానే సాగిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి పొలిటికల్ స్కెచ్ దాగి ఉందనే అనుమానాలను రాజకీయపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏయూలో కమ్యూనిస్టు పార్టీల కు చెందిన విద్యార్థి సంఘాలు మాత్రమే హవా సాగిస్తుంటాయి. ప్రధాన రాజకీయ పక్షాలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీకు చెందిన విద్యార్థి విభాగాలు ఉన్నా సరే పరిమితంగానే పని చేస్తుంటాయి. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తన అనుబంధ విభాగామైన ఏబీవీపీని క్యాంపస్ లో బలోపేతం చేయడంతో పాటుగా ఆర్ ఎస్ ఎస్ ను కు కూడా పూర్వ వైభవం సాగించాలనే పట్టు ఉందని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా విశాఖలో మొదటి మోయర్ బీజేపీనే. అప్పటి పరిస్థితిని సాగర నగరంలో తిరిగి తీసుకువచ్చే వ్యూహంలో భాగంగానే క్యాంపస్ లో జరిగిన వ్యవహాారాలు అని కొందరు భావిస్తున్నారు. యూనివర్శిటీ స్థాయిలో విద్యార్థి విభాగాన్ని యాక్టివ్ చేయడంతో అదే లోగుట్టున ఆర్ ఎస్ ఎస్ ను విస్తరించే ప్లాన్ ఉందేమోనని అనుమానాలకు బలం చేచూర్చేలా కూడా కొన్ని ఘటనలను ఉదహరిస్తున్నారు. వర్శిటీలో ఆందోళన జరిగిన సమయంలో ఏబీవీపీ క్యాడర్ ను ఎస్ ఎఫ్ఐ, ఏఐఎస్ ఎప్ నేతలు చుట్టుముట్టగా క్షణాల వ్యవధిలో బీజేపీకి యువజన విభాగం, న్యాయ విభాగం, మహిళా విభాగంకు చెందిన కొందరు కీలక నేతలు క్యాంపస్ వద్ద ప్రత్యక్షమవడం ప్రత్యక్ష నిదర్శనమంటున్నారు. అయితో పోలీసు ఉన్నతాధికారులు నచ్చజెప్పి పంపండంతో వారంతా వెనక్కి వెళ్లినా, వారి వ్యూహం ఏమిటో ఈ ఘటన ద్వారా పసిగట్టవచ్చునని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
మొత్తానికి ప్రశాంత నిలయంగా భావించే ఆంధ్రా యూనివర్శిటీలో విద్యార్థి సంఘాలు తమ ఆధిపత్య పోరుతో అలజడి సృష్టిస్తున్నరాని విశాఖ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, ఆయా స్టూడెంట్ వింగ్స్ మాత్రం తమ తమ రాజకీయపార్టీల అజెండా అమలుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. విద్యార్థల సమస్యలు పరిష్కరించే స్థాయిలో సంఘాలు బలపడాలి కానీ, రాజకీయ పార్టీల సిద్ధాంతాలు వ్యూహాత్మక ఎత్తుగడలను అమలు చేసేలా కాదని హితవు పలుకుతున్నారు. అయితే విద్యార్థి సంఘాలు తీరు మార్చుకుంటాయాా.. లేక ఎప్పటిలాగే రాజకీయ గొడుగు కింద కొనసాగుతాయా అన్నది తేల్చుకోవాలని సగటు విద్యార్థులు కోరుతున్నారు.. రాబోయే రోజుల్లో ఏయూలో జరుగుతుందో చూడాలి మరి.
