Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshఏకసభ్య కమిషన్ పై పిటీషన్

ఏకసభ్య కమిషన్ పై పిటీషన్

దాఖలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి

తిరుమల లడ్డూ కేసులో కీలక పరిణామం

రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు మోకాలడ్డు

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారనే ఆరోపణలపై చెలరేగిన వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టులో కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై గతంలో సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, సిట్ నివేదికను పరిశీలించేందుకు లేదా ఈ అంశంపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ నివేదిక పరిశీలించి నివేదిక సమర్పించాలని రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్‌ తో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇప్పటికే ఒక సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మళ్ళీ దానిపై మరో కమిషన్‌ను నియమించడం న్యాయపరంగా సరికాదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న విచారణ ప్రక్రియను ఇది ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలు, ప్రస్తుత ఆరోపణలతో ఈ విచారణ అత్యంత పారదర్శకంగా జరగాలని సుబ్రహ్మణ్య స్వామి కోరుతున్నారు.

నేడే విచారణ

సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిబ్రవరి 23న విచారించనుంది. గత ప్రభుత్వ నిర్ణయాలు, టీటీడీ పాలకమండలి వ్యవహారశైలిపై వైసీపీ నేతలు కూడా తమ వాదనలు వినిపిస్తున్న తరుణంలో, ఈ విచారణకు ప్రాధాన్యత ఉంది. లడ్డూ ప్రసాదం పవిత్రత, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందోనని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం ముందుకు ఈ పిటిషన్ రానుంది. ఇందులో పలు అంశాలను సుబ్రహ్మణ్య స్వామి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తన పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఐ సిట్, టీటీడీ, సీఎం చంద్రబాబులను చేర్చారు. తాజా పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెబుతుందా అని అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వాస్తవానికి ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగానికి బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావించింది. కానీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ తో ఏపీలో ఉత్కంఠ నెలకొంది. జంతువుల కొవ్వు కలిసి నెయ్యితో తిరుమల లడ్డూలు చేసి భక్తులకు ప్రసాదం ఇచ్చారని.. దాంతో తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చడంతోపాటు కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలుమార్లు స్పష్టం చేశారు. ఇటీవల సిట్ నివేదిక సైతం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని తేలిందన్నారు. కానీ లడ్డూ ప్రసాదం తయారీకి జంతుకొవ్వు లాంటివి వాడలేదని మాజీ సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ధికోసం వైసీపీ మీద చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సరికాదని హితవు పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments