బీఎస్ లే అవుట్‌లో నిలచిపోతున్న ట్రాఫిక్
` జనావాసాల మధ్య కాలేజీలు, గెస్ట్ హౌస్‌లే కారణం
` పట్టించుకోని నాలుగో పట్టణ పోలీసులు
విశాఖ బాలయ్య శాస్త్రి లే అవుట్‌లో భారీ వాహనాలను రోజుల తరబడి రోడ్లపైనే పార్కింగ్ చేయడం వల్ల రోడ్లపై వెళ్లే మార్గం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫోర్తు టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డు నుంచి గురుద్వారా వరకూ మధ్య జాతీయ రహదారిని ఆనుకున్న రోడ్లలో అడ్డం దిడ్డంగా భారీ వాహనాలను పార్కింగ్ చేసేస్తున్నారు. కాలేజీలు..ఆస్పత్రులు, గెస్ట్ హౌస్‌లకు చెందిన భారీ వాహనాలతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కాలనీ వాసులు రోడ్డుపైకి వాహనాలతో రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్లతో పాటు బైకులతో వెళ్లేందుకు కూడా నానా పాట్లు పడాల్సి వస్తోందని కాలనీ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల మధ్య కమర్షియల్ వ్యవహారాలు చేపడుతుండడంతో ఈ సమస్య దాపురించింది. ఎవరి వాహనాలు ఆయా ప్రాంగణాల్లో పెట్టుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు గానీ రోజుల తరబడి 20 అడుగుల రోడ్లపై వాహనాలను నిలిపివేయడాన్ని కాలనీ వాసులు తప్పుబడుతున్నారు. ఫోర్తు టౌన్ పోలీసులు ఈ కాలనీలపై దష్టి సారిస్తే ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని స్థానికులు కోరుతున్నారు.

“““