Home Uncategorized కేంద్ర ఉక్కు మంత్రితో పల్లా భేటీ

కేంద్ర ఉక్కు మంత్రితో పల్లా భేటీ

0

– స్టీల్ ప్లాంట్ సమస్యలపై సమగ్ర చర్చలు
– సానుకూలంగా స్పందించిన ఉక్కుమంత్రి కుమారస్వామి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ని మర్యాదపూర్వకంగా కలిసి, స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన పలు కీలక సమస్యలపై ఆదివారం సమగ్రంగా చర్చించారు. ఉక్కునగరంలోని విమల విద్యాలయం మూసివేతపై పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కొనసాగింపులేక పాఠశాలను ఆకస్మికంగా నిలిపివేయడం వల్ల ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కూడా అనిశ్చితిలో పడిందని కేంద్ర మంత్రికి వివరించారు. ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతను కాపాడడంతో పాటు బకాయి జీతాలను తక్షణం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదే విధంగా ఆర్ ఐ ఎన్ ఎల్ కోసం భూములు సమర్పించిన స్థానికులైన ఆర్ కార్డు హోల్డర్ల సమస్యలను ప్రస్తావిస్తూ, పరిపాలనా అడ్డంకుల కారణంగా వారికి ఉద్యోగావకాశాలు దూరమవుతున్న పరిస్థితిని వివరించారు. ఈ అన్యాయాన్ని వెంటనే సరిదిద్దుతూ, సంబంధిత పరిమితులను తొలగించి, స్థానికులకు కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. గాజువాక మండలం సనివాడ గ్రామం–స్టీల్ ప్లాంట్ మధ్య కొనసాగుతున్న భూవివాదంపై కూడా పల్లా దృష్టి సారిస్తూ, సంయుక్త సర్వేలో గుర్తించిన భూములను పునరావాస అవసరాలకు వినియోగించి, ఆలయం, లైబ్రరీ వంటి సామూహిక సదుపాయాల ఏర్పాటుతో గ్రామస్తులకు న్యాయం చేయాలని సూచించారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి తెలియజేశారు. పల్లా ప్రతిపాదించిన ప్రతీ అంశంపై కేంద్ర ఉక్కు మంత్రి హెచ్.డి. కుమారస్వామి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version