Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshనిడదవోలులో ఘనంగా మున్సిపాలిటీ 60 ఏళ్ల వేడుకలు

నిడదవోలులో ఘనంగా మున్సిపాలిటీ 60 ఏళ్ల వేడుకలు

ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ – మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు

నిడదవోలు పురపాలక సంఘం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ హాలులో మంగళవారం ఘనంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర పోస్టల్ శాఖ రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంపును ఆవిష్కరించారు.
రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదు
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజకీయ నాయకులకు పదవీ విరమణ అనేది ఉండదని స్పష్టం చేశారు. “ఉద్యోగులకు మాత్రమే రిటైర్మెంట్ ఉంటుంది. రాజకీయాల్లో ఇది కేవలం ఒక విరామం మాత్రమే” అని పేర్కొన్నారు. నేటితో పదవీకాలం ముగిస్తున్న మున్సిపల్ పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. గత ఐదేళ్లుగా పట్టణ అభివృద్ధికి కృషి చేసిన మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజల్లో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం రాజకీయ నాయకుల బాధ్యత అని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవ కొనసాగించాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి దిశగా నిడదవోలు
నిడదవోలు పట్టణ అభివృద్ధిపై మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా మాట్లాడారు. గత 20 నెలల్లో సుమారు రూ.140 కోట్ల నిధులతో పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని తెలిపారు. కూటమి ప్రభుత్వ సహకారంతో నిడదవోలుకు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా సాధించామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణల సహకారంతో మరిన్ని నిధులు రాబట్టి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
కమ్యూనిటీ హాళ్లకు స్థలాల పట్టాలు
కార్యక్రమం అనంతరం వివిధ సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం స్థలాల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. నాయి బ్రాహ్మణ సంఘం, పండ్లు-పూల వర్తకుల సంఘం, టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, దివ్యాంగుల సంక్షేమ సంఘాలకు లబ్ధి చేకూరింది. అలాగే 10వ వార్డులో రజకుల కమ్యూనిటీ హాల్ మరమ్మతులకు రూ.10 లక్షలు కేటాయించినట్లు ప్రకటించారు.
చలివేంద్రం ప్రారంభం
వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల కోసం ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రజలకు స్వయంగా మజ్జిగ, చల్లని తాగునీరు పంపిణీ చేసి ప్రజాసేవకు తన నిబద్ధతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, కౌన్సిలర్లు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments