నేర్చుకోవాలనే తపన ఉండాలి
– అదే నూతన అవకాశాలను కలిగిస్తుంది
జిజ్ఞాసతో ముందుకు సాగాలని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా చీఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫీసర్ ఫియోన అలెన్ అన్నారు. బుధవారం బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించిన కెరియర్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శతాబ్ది వేడుకలను జరుపుకుంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వందేళ్ల ఘన చరిత్ర, అద్భుతమైన విజయాలతో ఈ విశ్వవిద్యాలయం ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. మీ అందరి విజయాలను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. కెరీర్ గురించి ప్రారంభ దశ నుండే ఆలోచించడం విద్యార్థులకు లభించిన ఒక గొప్ప అవకాశమన్నారు. ఈ కార్యక్రమంపై నమ్మకం ఉంచిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన వ్యక్తిగత కెరియర్ అంతా జిజ్ఞాస, సేవా దృక్పథంపైనే ఆధారపడి ఉందన్నారు. యూనివర్సిటీలో స్నేహితులతో కలిసి పనిచేయడం వల్ల తనకు జట్టుగా పనిచేయడం యెక్క ప్రాముఖ్యత తెలిసిందని చెప్పారు. తాను చదువుకునే రోజుల్లో ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేయాలని అనుకున్నానని, తన మెంటార్స్ సరైన దిశలో నడిపించారని వివరించారు.
మెంటార్లు అందించిన ప్రోత్సాహమే తాను ఆస్ట్రేలియాకు వెళ్లడానికి, తరువాతి కాలంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి దోహదపడిందన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవడానికి, ప్రస్తుత తరం విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు.
ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంతో ఏయూ చేసుకున్న ఎంఓయూను కార్యరూపంలో చూపుతూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. దీనికి వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అమిత్ చక్మా గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
కెరియర్ను మలచుకునే సమయంలో విద్యార్థులు వాయిదావేసే తత్వాన్ని మానుకోవాలని సూచించారు. యూనివర్సిటీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుండే లక్ష్యం ఏర్పరచుకుని దాని దిశగా పనిచేయడం, మీరు ఎంపిక చేసుకున్న కోర్సుపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లకు మార్గనిర్దేశం చేసే విధంగా ఒక క్రమబద్ధమైన మెంటరింగ్ ప్రోగ్రామ్‌ను త్వరలో ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. విద్యార్థులు తమ బహుముఖ ప్రజ్ఞను నిర్ణీత సమయంలో ఎలా ప్రదర్శించాలో తెలుసుకోవాలని, అప్పుడే విజయం సాధ్యపడుతుందన్నారు. కెరియర్ బిల్డింగ్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వం ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కమీషనర్ డాక్టర్ ఇయాన్ మార్చినస్, సిపిడిసి డీన్ ఆచార్య వజీర్ మహమ్మద్, ఐసిఇడిసి చైర్ పర్సన్ రాక్వెల్ ష్రాఫ్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా ఏయూ ఆచార్యులకు నిర్వహించిన కెరియర్ మానిటరింగ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికేట్లను ప్రధానం చేశారు. అనంతరం విద్యార్థులకు కెరియర్ ప్లానింగ్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై అవగాహన కల్పించారు.
