రాజమహేంద్రవరం, జయజయహే ప్రతినిధి: కలుషిత పాలు సేవించి అనారోగ్యం పాలైన బాధితులను రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ కిర్తీ చేకూరి తో కలిసి శనివారం రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో సమీక్షించి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
15 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, చౌడేశ్వరీ నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో అత్యవసర వైద్య బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 110 ఇళ్లలోని 315 మందికి రక్తపరీక్షలు నిర్వహించగా 313 మందికి సాధారణ ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. గణేష్ ద్వారా సరఫరా అయిన పాలను సేవించిన 957 మందిని ప్రతిరోజూ పరీక్షిస్తున్నామని చెప్పారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్స్, ఏఐజీ ఆస్పత్రి నుంచి ప్రత్యేక వైద్య బృందాలు రాజమండ్రికి రానున్నట్లు వెల్లడించారు. కల్తీ పాలు సరఫరా చేసిన గణేష్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
కలుషిత పాలు బాధితులకు మంత్రి నిమ్మల పరామర్శ
RELATED ARTICLES
