Monday, June 22, 2026
HomePoliticsAndhra Pradeshఅభివృద్ధి పేరిట ఉత్తరాంధ్ర సంపద లూటీ

అభివృద్ధి పేరిట ఉత్తరాంధ్ర సంపద లూటీ

అసలైన అభివృద్ధి చర్యలు చేపట్టాలి
– రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖులు
– గిరిజన చట్టాలు కూడా బేఖాతరు
ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరిట పాలకులు భారీ ఎత్తున లూటీ చేస్తున్నారని ప్రొఫెసర్ చలం ఆరోపించారు. గురువారం
ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఎంవీపీ గిరిజన భవన్లో విశాఖ జిల్లా కన్వీనర్ కోరాబు సత్యనారాయణ అధ్యక్షతన ఉత్తరాంధ్ర అభివృద్ధి పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో
ప్రొఫెసర్ కె ఎస్ చలం మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలో అభివృద్ధి పేరున పరిశ్రమలు, వివిధ ప్రాజెక్టుల పేరున పెద్ద ఎత్తున భూసేకరణలు చేపట్టాయని, గిరిజన చట్టాలను కూడా బే ఖాతారు చేస్తూ గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. విశాఖ నగర నడిబొడ్డున సముద్ర తీరంలోని అత్యంత విలువైన 13.74 ఎకరాల ప్రభుత్వ భూమిని లులు మాల్ కు కేటాయించడం చూస్తేనే ప్రభుత్వ అభివృద్ధి నమూనా ఎలాంటిదో అవగతమవుతుందని పేర్కొన్నారు. వేదిక ప్రధాన కార్యదర్శి ఎ. అజ శర్మ, సీనియర్ జర్నలిస్టులు శివ శంకర్, ఎన్. నాగేశ్వర రావు మాట్లాడుతూ, సామాన్యుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని, పారిశ్రామికాధిపతులకు ధారపోయడం ఉత్తరాంధ్రలో జరుగుతున్న ప్రధాన ప్రక్రియగా పేర్కొన్నారు. దీన్ని వ్యతిరేకించేవారిపై ఒత్తిడి, తీవ్ర నిర్బంధాలకు సైతం పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు సరైనవి కాదన్నారు.
ప్రభుత్వ చర్యలపై ఎక్కడికక్కడ ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. అయినా కాకినాడ వరకూ విస్తరిస్తూ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ పేరున పెద్ద ఎత్తున భూములు సమీకరించడానికి, ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయడానికి సన్నాహాలను ముమ్మరం చేస్తున్నారన్నారు.
1/70, పీసా వంటి గిరిజన చట్టాలను దిక్కరిస్తూ పాడేరు, పార్వతీపురం జిల్లాల్లో హైడ్రో పవర్, టూరిజం ప్రాజెక్టులకు భూములు లాక్కోవాలని చూస్తున్నారని, మరోపక్క బాక్సైట్ తవ్వకాలకు చాప కింద నీరులా పావులు కదుపుతున్నారని, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, మిట్టల్ స్టీల్ ప్లాంట్లకు భూసేకరణ వేగవంతం చేశారని, మందస వద్ద కార్గో ఎయిర్ పోర్ట్ పేరున భూసేకరణకు పూనుకున్నారని దయ్యాబట్టారు. విశాఖ జిల్లాలో గుగుల్ డేటా సెంటర్, టీసీఎస్ వంటి సంస్థలకు ఎకరా 99 పైసలకే భూమిని దారాదత్తం చేస్తున్నారని, ఇలా చేయడం సరైనదేనని తిరిగి సమర్ధించుకుంటున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు ప్రకృతి వరాలుగా ఉన్న సముద్ర తీరం, అటవీ ప్రాంతం క్రమేణా పరాధీనమవుతున్నాయని, గిరిజనులు, మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఉత్తరాంధ్రలో పేదరికం, వలసలు పెద్ద ఎత్తున పెరిగాయని, సముద్రతీరం వెంబడి ఏర్పడిన ఫార్మా, రసాయన పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో తీవ్ర పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. నీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ప్రభుత్వాలు ప్రకటనలయితే చేస్తున్నాయి తప్ప నిధులు కేటాయింపు కానీ, నిర్మాణ పనులు పూర్తి చేయడం గాని జరగడం లేదన్నారు. వంశధార, జంఝావతి, తీర్థ సాగర్, ఆఫ్ షోర్, సుజల స్రవంతి వంటి అన్ని ప్రాజెక్టులు దశాబ్దాలు గడుస్తున్నా అడుగు ముందుకు పడట్లేదని, ఈ ప్రాంత వనరులను, సంపదను ఒక పక్క కార్పొరేట్ల పరం చేస్తూ మరో పక్కన ఇదే అభివృద్ధి అని పాలకులు భ్రమలు కల్పిస్తున్నారన్నారు.
అసలైన అభివృద్ధికై ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచే చర్యలు చేపట్టాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కె ఎస్ చలం, వేదిక ప్రధాన కార్యదర్శి ఎ. అజ శర్మ, విశాఖ జిల్లా కో కన్వీనర్ కూన వెంకట రావు, సీనియర్ జర్నలిస్టులు శివ శంకర్, ఎన్. నాగేశ్వర రావు, విద్యార్థి, యవజన, మహిళా సంఘాల నాయకులు యుఎస్ఎన్ రాజు, సాయి, ఆర్వీన్ మాధవి, వై. సత్యవతి, వార్వా నాయకులు ఎన్ ప్రకాశ రావు, పిట్టా నారాయణమూర్తి, అష్రాఫ్, కేవీపీఎస్ అధ్యక్షులు ఎం. సుబ్బన్న, ఎల్ఐసి పెన్షనర్ల సంఘ నాయకులు బిటి ప్రసాద్, జెవివి నాయకులు మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments