*ప్రభుత్వానికి ప్రతిపాదించిన గంటా*
విశాఖపట్నం, ఫిబ్రవరి 20: (జయ జయహే) ఏప్రిల్ 26 న జరగనున్న ఆంధ్రా యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ కు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చయ్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ వైజాగ్ అంటే గూగుల్.. గూగుల్ అంటే వైజాగ్.. అనేలా ప్రపంచ పటంలో గుర్తింపు వచ్చిందన్నారు. వందేళ్ల చారిత్రక ఘట్టానికి సుందర్ పిచ్చయ్ హాజరు మరింత వన్నె తెస్తుందని చెప్పారు. ఏఐకు సంబంధించి పరస్పర సహకారం కోసం ఆంధ్రా యూనివర్సిటీ, గూగుల్ మధ్య ఎంఓయు జరిగితే విద్యారంగానికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సుందర్ పిచ్చయ్ రెండు, మూడు సందర్భాల్లో వైజాగ్ గురించి ఆప్యాయంగా మాట్లాడడం జరిగిందని.. భవిష్యత్ లో వైజాగ్ ఏఐ హబ్ కానుందని గురువారం ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో ఉద్ఘాటించారని తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్ధులు దేశ విదేశాల్లో అనేక రంగాల్లో ప్రముఖులుగా స్థిరపడ్డారన్నారు. గతంలో తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రంధి మల్లికార్జునరావు (జీఎంఆర్) చైర్మన్ గా, ప్రస్తుత ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు కార్యదర్శిగా ఎ.ఎ.ఎ. పేరుతో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్ధుల అసోసియేషన్ ఏర్పాటు చేసి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుల్ని భాగస్వామ్యం చేశామని వివరించారు. అసోసియేషన్ కార్యక్రమాలకు రతన్ టాటా, ఇన్ఫోసిస్ సుధామూర్తి తదితరులు హాజరయ్యారన్నారు. వందేళ్ల పండుగ గుర్తుండేలా ఆంధ్రా యూనివర్సిటీకి వంద కోట్ల నిధులు కేటాయించి ఐకానిక్ భవనాన్ని నిర్మించడం లేదా రీసెర్చ్ కోసం ఆ నిధులను కేటాయించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లతో మాట్లాడి ఆంధ్రా యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ ను మరపురాని జ్ఞాపకంలా నిర్వహించాలని అన్నారు
