గవర్నర్ ప్రసంగానికి వస్తే హాజరు వేయాలా
ఈ నిబంధన ఎక్కడుంది
జగన్ జీతం తీసుకోవడం లేదు
మిగిలిన వారంతా తీసుకుంటున్నారు
మాజీ సీఎంగా గౌరవాలన్నీ ఇస్తున్నాం
చిట్ చాట్ లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు
శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మీడియాతో జరిపిన ఇష్టాగోష్టి లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పోకడలు, సభకు ప్రతిపక్షం గైర్హాజరు కావడం, శాసనమండలిలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. శాసనసభకు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి , ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాకపోవడంపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా ఉంటుంది” అని వ్యాఖ్యానిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని గుర్తుచేశారు. అటువంటి వేదికకు గైర్హాజరు కావడం సబబు కాదని ఆయన హితవు పలికారు. వైసీపీలో జగన్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని, పని చేయకుండా జీతాలు తీసుకోవడంపై ఆయన పరోక్షంగా చురకలు అంటించారు. గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వస్తే అది పూర్తిస్థాయి హాజరుగా పరిగణించరని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం రోజు వస్తే హాజరుగా పరిగణించాలనే నిబంధన ఎక్కడుంది అని ఆయన ప్రశ్నించారు. నిబంధనల గురించి అవగాహన లేకుండా అడ్డగోలు వాదనలు చేసే వారిని ఏమనాలని ఆయన ప్రశ్నించారు. ఇక వైసీపీ సభ్యుల అనర్హత వేటు అంశంపై స్పందిస్తూ.. దానికి ఇంకా సమయం రావాలని, ఏపీలో ఈ ప్రక్రియ విజయవంతమైతే దేశమంతా అదే బాటలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి దక్కాల్సిన గౌరవ మర్యాదలన్నీ సభలో లభిస్తున్నాయని అయ్యన్న తెలిపారు. అయితే గతంతో పోలిస్తే రాజకీయాల్లో సంస్కృతి మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు సభలో ఎంతగా పోరాడినా.. బయట మాత్రం ఎంతో స్నేహంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి పోయి అందరూ విరోధుల్లా తయారవుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. శాసనమండలి తీరుపై కూడా స్పీకర్ ఘాటుగా స్పందించారు. పెద్దల సభ అంటే పెద్ద ఆలోచనలు ఉన్నవారితో ఉండాలని, కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ పరిస్థితి లేదనిపించిందని అన్నారు. పెద్ద ఆలోచనలు లేనివారు ఆ సభలో ఉంటే వ్యవస్థ ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామంటూ మండలిలో జరుగుతున్న గందరగోళాన్ని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
