వారి భూములు వారికిచ్చేయండి….పీసీసీ అధ్యక్షులు షర్మిల
అధికారం చేతిలో పెట్టుకొని మల్లంపేట పేద రైతుల భూములు లాక్కోవడం సరైంది కాదని, వెంటనే వారి భూములు వారికి అప్పగించాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ను,పీసీసీ అధ్యక్షులు షర్మిల డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరం జిల్లా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో ఆమె ఉపాధి హామీ పథకం తీరు తెన్నులు, పేదల భూములు అన్యాక్రాంతంపై రచ్చబండ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి మల్లంపేట గ్రామ నిరుపేద రైతులు తమ భూములను ఎమ్మెల్యే బేబినాయన ఆక్రమించారని ఆధారాలతో కూడిన వినతి పత్రం ఆమెకు అందజేశారు. దీనిపై అక్కడికక్కడే స్పందించిన ఆమె సభలోనే బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనతో ఫోన్లో మాట్లాడారు. ఈ పేద రైతులకు 1991 లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినల్యాండ్ సీలింగ్ సాగు భూములను మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే బలవంతంగా ఆక్రమించుకొని తిరిగి ఆ పెదరైతులపై అక్రమ కేసులు పెట్టీ భయపెట్టడం సరైంది కాదని హితవు పలికారు. ఇంతవరకు సాగు చేసుకొంటూ, ప్రభుత్వ అన్నదాత సుఖీభవ, పి ఎం. కిసాన్ తదితర పథకాలు అందుతున్నాయి. అయినప్పటికీ వారి భూములను బలవంతంగా లాక్కొని ఇవి మీ భూములు మీవి కాదని రెవెన్యూ అధికారులుతో ఆ పేదలకు మీరు చెప్పిస్తున్నారు. మరి అన్ని హక్కులున్న వారి భూములు ఎక్కడున్నాయో రెవెన్యూ అధికారులతో చెప్పించి అప్పగించండి లేదా వారి భూముల నుంచి మీరు మీ మనుషులు తప్పుకొని వారి భూములు వారికి అప్పగించండి… ఎమ్మెల్యే బేబినాయన ఫోన్లో చెప్పబోగా మీ అధికారం మీ చేతిలో ఉన్న అధికారులు శాశ్వతం అని భావించకండి, పేదలకు అన్యాయం చేయవద్దు. ఇలాంటి పేదలపక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది. వారి సమస్యలపై పోరాడుతుంది. ఎమ్మెల్యే గా పేదల సమస్యలు పరిష్కరించవలసిన మీరే తిరిగి పేదలకు సమస్యగా మారితే ఎలా సమాజం బాగుపడుతుంది ఎమ్మెల్యే బేబినాయన అని షర్మిల నిలదీశారు. ఆ వెంటనే ఈ భూ సమస్యపై విజయనగరం జిల్లా కలెక్టర్, స్థానిక, వి ఆర్ ఓ లతో ఫోన్లో మాట్లాడి అన్ని భూమి హక్కులు ఉన్న ఈ రైతులకు వెంటనే న్యాయం జరిపించాలని డిమాండ్ చేశారు.అనంతరం 35 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న మల్లంపేట ఏడు ఎకరముల భూమిని షర్మిల స్వయంగా పరిశీలించి ఆ పేద రైతులకు దైర్యం చెప్పి మీ భూమి మీకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున తాను అండగా ఉంటానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్, బొబ్బిలి కాంగ్రెస్ ఇంచార్జీ మువ్వల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
