Monday, April 27, 2026
HomePoliticsAndhra Pradeshమార్గాని ‘సోలో షో’నా? సీనియర్లను సైడ్‌లైన్ చేస్తున్నారా? రాజమండ్రి వైసీపీలో మంటలు!

మార్గాని ‘సోలో షో’నా? సీనియర్లను సైడ్‌లైన్ చేస్తున్నారా? రాజమండ్రి వైసీపీలో మంటలు!

రాజమండ్రి సిటీ వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయా? ఎంపీ మార్గాని భరత్ రామ్ వ్యవహార శైలి ఇప్పుడు పార్టీ లోపలే తీవ్ర చర్చకు దారి తీసింది. సీనియర్ నేతలను పట్టించుకోకుండా, తన వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు రోజురోజుకు ముదురుతున్నాయి.
ఇటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాతోనూ, అటు మాజీమంత్రి, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్ తోనూ సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. అలాగే రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలా రెడ్డి , మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశ్ కూడా మాజీ ఎంపీ భరత్ తో అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం, ‘అవును’ అన్న వారికే వేదికపై స్థానం కల్పించడం వంటి అంశాలు అసంతృప్తిని రగిలిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

“ పార్టీనా? వ్యక్తిగత వేదికనా?”
రాజమండ్రి సిటీలో జరుగుతున్న కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలా? లేక వ్యక్తిగత ప్రదర్శనలా? అనే ప్రశ్నలు సీనియర్ నాయకుల వర్గం లేవనెత్తుతోంది. భజనపరులకే పెద్దపీట వేస్తూ, అనుభవజ్ఞులైన నేతలను పక్కన పెట్టడం వల్ల కేడర్‌లో గందరగోళం నెలకొంటోందని చెబుతున్నారు.
ముఖ్యంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ విభేదాలు పార్టీకి భారీ నష్టాన్ని మిగల్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. “ఇలాగే కొనసాగితే పోటీకి దూరంగా ఉంటాం” అంటూ కొందరు సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అధిష్టానం స్పందించకపోతే?
రాజమండ్రి వంటి కీలక నగరంలో పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతమైతే, అది జిల్లా రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్షం ఈ పరిణామాలను గమనిస్తోందని సమాచారం.
మరోవైపు, భరత్ అనుచరులు మాత్రం “క్రమశిక్షణ, పనితీరు ఆధారంగానే ప్రాధాన్యం” ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ సీనియర్ నేతల అసంతృప్తి మాత్రం చల్లారడం లేదు.
ఇప్పుడీ ప్రశ్నలే రాజమండ్రి రాజకీయాల్లో హాట్ టాపిక్:
మార్గాని భరత్ తన ఆటిట్యూడ్ మార్చుకుంటారా?
లేక సీనియర్లతో ఢీ కొట్టే పరిస్థితి మరింత ముదురుతుందా?
మున్సిపల్ ఎన్నికల ముందు వైసీపీలో ఈ అంతర్గత యుద్ధానికి ముగింపు పలికేది ఎవరు?
రాజమండ్రి రాజకీయ వేదికపై తెర వెనుక జరుగుతున్న ఈ ‘సైలెంట్ వార్’ ఎటు దారి తీస్తుందో చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments