Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshస్వర్ణాంధ్ర విజన్ తో ఆదాయం పెరుగుదల

స్వర్ణాంధ్ర విజన్ తో ఆదాయం పెరుగుదల

రూ. 3 లక్షల నుంచి రూ. 54 లక్షలకు పెంచుతాం

సూపర్ సిక్స్.. సూపర్ హిట్

సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ

బడ్జెట్ కేటాయింపులపై చర్చలో కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం సంక్షేమ బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. సామాజిక సమానత్వం అనే లక్ష్యం కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. రాజకీయంగా కూడా వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సంక్షేమం విషయంలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేశామని ఉద్ఘాటించారు. ఆటో కార్మికులు, మత్స్యకారులు, చేనేతలకు కూడా మేలు చేశామని తెలిపారు.

నిత్యావసర సరకులు కూడా సక్రమంగా అందించేలా సాంకేతికత సాయం తీసుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ఎక్కువ కేటాయింపులు చేశామని చెప్పుకొచ్చారు. బడ్జెట్ కేటాయింపులు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని వివరించారు. స్వర్ణాంధ్ర – 2047 విజన్‌లో భాగంగా తలసరి ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.54 లక్షలకు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భావితరాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. అంగన్‌వాడీ నుంచి స్కూళ్లు, కాలేజీల వరకూ మంచి విద్య, వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పేద వర్గాల ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించామని సీఎం చెప్పారు.

ఆర్థిక అసమానతలు తొలగించటానికి చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. 10 లక్షల బంగారు కుటుంబాలను లక్షమంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని వివరించారు. ‘నిరంతరం పర్యవేక్షిస్తేనే ఏ కార్యక్రమమైనా ఫలితాలనిస్తుంది. అట్టడుగున ఉన్న పేదవర్గాలనూ ఆదుకునేలా పీ4 ప్రణాళికలు ఉన్నాయి. పూటగడవని పేదవారిని ఎలా పైకి తీసుకురావాలో అందరూ ఆలోచించాలి. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే పేదరికం ఉండరాదు. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా కూటమికి 94 శాతం విజయం కట్టబెట్టారు. బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కమిషన్ వేశాం. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే సమయానికి రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఆ ఘనత ఎన్డీఏదే..

బీసీ జాబితాలోని కొన్ని వర్గాలను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్లను కూడా పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ‘ఎస్సీ వర్గీకరణ తెచ్చి.. ఆ దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. గిరిజనుల కోసం తెచ్చిన జీఓఎంఎస్ నంబర్‌-3ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంపై ఏం చేయాలో గిరిజన సంఘాల నుంచి అభిప్రాయలు సేకరించి ముందుకెళ్తాం. మైనార్టీ వర్గాలకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించింది’ అని సీఎం చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments