నవోదయ విద్యాలయంలో పేరుకుపోయిన మురుగు పట్ల గంటా ఆగ్రహం కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయంలో పారిశుద్ధ్య పరిస్థితిపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వలో మురుగు ఇంత ఘోరంగా ఉంటే రోగాలు రావా? అని విద్యాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించే అధికారితో పాటు జీవీఎంసీ సిబ్బందిని నిలదీశారు. నవోదయ విద్యార్ధులు కొందరు అస్వస్థతకు గురైన నేపథ్యంలో సోమవారం ఆయన విద్యాలయాన్ని సందర్శించారు. ఒక విద్యార్థికి మలేరియా సోకిన కారణంగా దోమల నివారణ ద్రావకాన్ని జీవీఎంసీ సిబ్బంది శనివారం ఫాగింగ్ చేయడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యాలయం అధికారులు చెబుతుండగా.. స్నాక్స్ గా ప్యాకేజ్డ్ ఫుడ్ తిన్న కారణంగా వాంతులు, తలతిరగడం లక్షణాలు విద్యార్థుల్లో కనిపించాయని మరో వాదన వినిపిస్తోంది. 50 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం పాలు కాగా.. 8 మందికి స్థానిక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చికిత్స అందించారు. విద్యాలయంలో కోలుకుంటున్న విద్యార్థులను ఎమ్మెల్యే పరామర్శించారు. అస్వస్థతకు దారి తీసిన కారణాలపై విద్యార్థులతో మాట్లాడారు. తరగతి గదులు, టాయ్ లెట్లు, గ్రంథాలయం, ల్యాబ్ లను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో డైనింగ్ హాల్ లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యాలయంలో తీవ్రమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ.. తాగునీరు, పారిశుద్ధ్యం సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మీడియాతో మాట్లాడుతూ గంటా చెప్పారు. నాణ్యత లేని బంగాళాదుంపల వాడారని, విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కిచెన్, డైనింగ్ హాల్ పక్కన కాల్వలో పేరుకుపోయిన మురుగును చూసి గంటా మండిపడ్డారు. పారిశుద్ధ్యం ఇంత దారుణంగా ఉంటే రోగాలు ఎందుకు రావని ప్రశ్నించారు. తక్షణమే డ్రైనేజీ శుభ్రం చేయాలని జీవీఎంసీ సిబ్బందిని ఆదేశించారు. ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ వి. అయ్యప్ప నాయుడు, కూటమి నేతలు గరే గుర్నాథ్, దాసరి శ్రీనివాస్, పిల్లా వెంకట్రావు, మాన్యాల సోంబాబు, కె. అచ్యుతరావు, లొడగల జానకిరామ్, నాగోతి సత్యనారాయణ, నమ్మి రమణ, పోతిన ప్రసాద్, నాగేశ్వరరావు, ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్యం ఇంత ఘోరంగా ఉంటే రోగాలు రావా?
RELATED ARTICLES
