Friday, April 17, 2026
HomePoliticsAndhra Pradeshఆయన వేధిస్తే...కార్చిచ్చు మంటలే...!

ఆయన వేధిస్తే…కార్చిచ్చు మంటలే…!

– రగులుతున్న కేజీహెచ్ ఉద్యోగులు
– జయ జయహే వార్తలపై అత్యసర ఉద్యోగుల సమావేశం
– ఆయన ప్రమేయం లేదన్నట్టుగా మౌనవ్రతం
– ఉద్యోగులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు

దీర్ఘకాలంగా ఒకే చోట ఉద్యోగాలు చేయడం ఎవరికైనా సాధ్యమా…ప్రభుత్వ రంగంలో అది అయ్యే పని కాదు. అలాగని ఉద్యోగులను ఎప్పుడు బడితే అప్పడు బదిలీ చేసేయడమూ అంత ఈజీ కాదు. ఏ రెండేళ్లకో…మూడేళ్ళకో బదిలీ జరిగితే అది సాధారణమేనని భావిస్తుంటారు. అందుకు ఉద్యోగ సంఘ నేతలు కూడా ఏ మాత్రం అడ్డుచెప్పరు. రెండు…మూడు మాసాలకు బదిలీ చేసేయడం ఎక్కడైనా చూశారా… ఇక్కడ అదే ట్విస్ట్ మీకు విపులంగా చెబుదామనుకుంటున్నాను. కేజీహెచ్‌లో ఘనత వహించిన ఓ ప్రధాన అధికారి తన అవినీతి సామ్రాజ్య కోటకు మెట్లు కట్టుకున్నంత ఈజీగా ఉద్యోగులతో కుర్చీలాట ఆడించేశారు. ఇలా ఉద్యోగులతో నిత్యం వివాదాలు రాజేసే ఈ ఉన్నతాధికారి తీరును ఎలా అర్ధం చేసుకోవాలో తెలీక నానా పాట్లు పడుతున్నారు. అయితే హిట్లర్…బ్రిటీష్ కాలం నాటి పాలనతో కేజీహెచ్ పరిపాలనా తీరును సరిపోల్చుతున్నారంటే ఉద్యోగులు ఎంతలా విరక్తి చెందారో ఊహించుకోవచ్చు. ఉద్యోగులపై మరీ కత్తి కట్టి ఇలా వేధించే బదులు ఆ ఉద్యోగుల సేవలు అవసరం లేదంటూ నేరుగా ప్రభుత్వానికే సరెండర్ చేసేస్తే సరిపోతుందన్నది సదరు ఉద్యోగుల వాదన. కానీ వారి నుంచి కూడా ముక్కు పిండి వసూలు చేసేందుకు ఇంత తంతు అవసరమా ….ఏడు కొండల వాడా…వేంకట రమణా…అంటూ దండం పెడుతున్నారు. ఆయా బదిలీ వేధింపులు ఎలా ఉంటాయో చూద్దాం.
– కేజీహెచ్‌కు కూతవేటు దూరంలో ఇల్లు వాకిల్లు ఉన్న వారెవరైనా అక్కడి ఉద్యోగాన్ని వదులుకుంటారా…కానీ దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు అక్కడే ఉద్యోగం చేసిన ఓ క్లర్కు శ్రీనివాస్ తన సర్వీసును అర్ధాంతరంగా ముగించేశారంటే ఆ పుణ్యం అంతా ఆ ఉన్నతాధికారికే దక్కుతుందని ఉద్యోగులంతా కోడై కూస్తున్నారు. ఆయనతో పాటు మరో ఉద్యోగి కృష్ణ కూడా తన సర్వీసును వదిలేసి కేజీహెచ్‌కు దూరమయ్యారు.
– కేజీహెచ్‌లో గత ఎనిమిది మాసాల్లో మూడు సార్లు అంటే పట్టుమని మూడు మాసాలు కూడా ఒక ఉద్యోగిని స్థిరంగా సీట్లో ఉంచకుండా సెక్షన్స్ మార్చేశారు. అందుకు మొదటి సారి పరిపాలనా పరమైన కారణాలు ఒంక చెప్పి సాధారణ బదిలీలే అంటూ మార్పు చేశారు.
– రెండో సారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదేశాను సారం బదిలీలు చేస్తున్నామంటూ ట్రాన్స్‌ఫర్స్ ఆర్డర్స్ చేతిలో పెట్టారు.
– మూడో సారి కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాలని బదిలీ చేసేశారు. నిజం చెప్పాలంటే ఇన్‌ఛార్జి మంత్రి, కమిషనర్‌లు మరీ అంత దిగజారిపోయి క్లర్కు సెక్షన్‌లను కూడా మార్చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగే పని కాదని ఉద్యోగులందరికీ తెలిసిన విషయమే. కానీ నిజంగా అలా జరగాలంటే సదరు ఉద్యోగులపై తీవ్రమైన అవినీతి అభియోగాలుగానీ, మరే ఇతర బలమైన కారణాలు కానీ ఉండాలి. అలాంటిదేమీ లేకుండా 8 నెలల్లో మూడు సార్లు బదిలీ చేసేశారంటే అది ఆయా ఉద్యోగులపై కక్షసాధింపు కాకపోతే మరేమనుకోవాలి.
– మినిస్టీరియల్ ఉద్యోగులకు అప్పుడప్పుడు సదరు అధికారి మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్‌కు ఒకే ఒక్క నిమిషం లేటయితే…మీటింగ్ అయ్యే వరకూ నిలబెట్టి అవమానించడమే పనిష్‌మెంట్. ఇలాంటి వేధింపులు తట్టుకోలేక ఒకరిద్దరు ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నారంటే ఆయన టార్చర్….కార్చిచ్చు మంటలే.

ఉద్యోగులతో బుజ్జగింపులు..!

గత రెండు రోజులుగా జయ జయహే పత్రికలో వస్తున్న కధనాలపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, అడ్మినిస్ట్రేటర్ రమణ, ఏడీలు సుమతి, షేక్ బాసిత్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉద్యోగులను గౌరవంగా వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీలు గుప్పించారు. అయితే గతంలో వలే ఈ సమావేశంలో పరిపాలనాధికారి రమణ మాత్రం ఎలాంటి ఉపన్యాసం ఇవ్వలేదు. ఆయన చెప్పాలనుకున్న వాటన్నింటినీ సూపరింటెండెంట్ ద్వారా చెప్పించారని అంతే తప్ప ఈ మీటింగ్ ప్రత్యేకత ఏమీ లేదని ఉద్యోగులు అంటున్నారు. బదిలీలన్నీ ఉద్యోగులతో 100 శాతం పని చేయించుకోవడానికేనని నమ్మించేందుకు తీవ్రంగా కష్టపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments