సీఎం చంద్రబాబు ను దూషించడం తో మాజీమంత్రి అంబటి రాంబాబు పై నమోదైన కేసులతో పాటు సంక్రాంతి సంబరాలు సందర్భంగా లాటరీ పేరిట ప్రజలను మోసం చేశారనే కారణంతో అంబటి పై నమోదైన కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయడం తో
అంబటి రాంబాబు బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. అనంతరం ఆయన జైలు బయట మీడియాతో మాట్లాడుతూ…..“నన్ను చంపేందుకు ప్రయత్నించారు… అది కుదరక జైలుకి పంపించారు. కానీ నేను స్పష్టంగా చెబుతున్నా — ఐ డోంట్ కేర్!” అంటూ గట్టిగా ప్రకటించారు.
తనపై దాడి జరిగిందని, ఇంటిని ధ్వంసం చేశారని, ప్రాణాలకు ముప్పు కలిగించారని ఆయన ఆరోపించారు. “ఇది రాజకీయ వేధింపుల పరాకాష్ట. ప్రశ్నిస్తే కేసులు, మాట్లాడితే జైలు — ఇదేనా మీ ప్రజాస్వామ్యం?” అంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.
“నన్ను బెదిరిస్తే నేను మౌనంగా ఉంటాననుకుంటే పొరపాటు. ఐ డోంట్ కేర్! జైలు గోడలు నా స్వరాన్ని ఆపలేవు. ప్రజలే నా బలం… న్యాయమే నా ఆయుధం,” అని ఘాటుగా స్పందించారు. తనపై నమోదైన కేసులు కక్షసాధింపునకు నిదర్శనమని, రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమేనని విమర్శించారు.
జైలు బయట పెద్ద సంఖ్యలో చేరిన అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతూ, “ఈ జనసందోహమే నా సమాధానం. ఎంత ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గను. ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతుంది. ఐ డోంట్ కేర్ — నిజం గెలుస్తుంది!” అని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో విమర్శించడం నేరమా? అన్యాయాన్ని ప్రశ్నిస్తే జైలా? అంటూ ఆయన వేసిన ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత దుమారం రేపుతున్నాయి. తనపై జరిగిన దాడులు, కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తానని, “నన్ను ఆపలేరు… ప్రజల తీర్పే అంతిమం,” అంటూ ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు జైలు బయట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్, తానేటి వనిత, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
“ఐ డోంట్ కేర్… నన్ను భయపెట్టలేరు!” — అంబటి రాంబాబు
RELATED ARTICLES
