Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshఉపాధి హామీ యాత్రకు భారీ ర్యాలీ: కాంగ్రెస్ నేత భద్రందొర

ఉపాధి హామీ యాత్రకు భారీ ర్యాలీ: కాంగ్రెస్ నేత భద్రందొర

నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రందొర ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిడదవోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా భద్రందొర మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీన గోపాలపురం నియోజకవర్గంలోని దుద్దుకూరు గ్రామంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిడదవోలు నియోజకవర్గం నుంచి సుమారు 100 మంది భారీ ర్యాలీగా తరలివెళ్తారని తెలిపారు.
ఉపాధి హామీ పథకం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మహోన్నత కార్యక్రమమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ పథకానికి 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయని తెలిపారు. పేదలకు ఉపాధి కల్పించి వారి జీవితాలకు భరోసా ఇచ్చిన అద్భుత పథకమని కొనియాడారు.
ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60 శాతం మాత్రమే నిధులు ఇస్తామని చెప్పడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం కూడా చెల్లించలేని పరిస్థితిలో 40 శాతం ఎలా భరిస్తుందని ప్రశ్నించారు. అంతేకాక మహాత్మా గాంధీ పేరు తొలగించి ఇతర పేరుతో మార్చడం వెనుక పథకాన్ని బలహీనపరచాలనే ఉద్దేశం ఉందని ఆరోపించారు. పేదలకు కూలి పనిని అందించే పథకాన్ని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్రపూరితంగా దెబ్బతీస్తున్నాయని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్నం మురళీకృష్ణ, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దారపు రెడ్డి సుజాత, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భావన రమేష్, బుద్ధన లక్ష్మణరావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బషీర్, సీనియర్ నాయకులు కొణిజేటి నారాయణ, జిల్లా ఓబీసీ విభాగం అధ్యక్షుడు పెచ్చేటి కోటేశ్వరరావు, మహమ్మద్ అన్వర్ ఖాన్, వంగూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments