రూ.10 లక్షలతో చేతులు దులుపుకున్న ప్రభుత్వం – కనీసం రూ.25 లక్షలు ఇవ్వాలి
మృతురాలు కనకరత్నం పేరు జాబితాలో లేదని ఆరోపణ
ఎథిలిన్ గ్లైకాల్ కథతో అసలు నిజాలు దాచిపెడుతున్నారంటూ విమర్శలు
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ డిమాండ్
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకున్న పాల కల్తీ ఘటనపై రాజకీయ వేడి మరింత పెరిగింది. వైద్యం పొందుతున్న వృద్ధులు, చిన్నారుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ— “అన్నం పున్నమి ఎరుగని పసిపిల్లలు ఇంతటి నరకయాతన అనుభవిస్తుంటే ప్రభుత్వం నిశ్చేష్టంగా చూస్తోంది. ఇది దారుణం, అమానుషం” అని మండిపడ్డారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 80 ఏళ్ల కనకరత్నం పేరు అధికారిక మృతుల జాబితాలో లేకపోవడం అత్యంత అన్యాయమని ఆరోపించారు. పోస్టుమార్టం ప్రక్రియను హుటాహుటిన పూర్తి చేసి నిజాలు ముసుగు వేయడానికి ప్రయత్నించారని విమర్శించారు.
మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించడం తూతూ మంత్రంగా చేసిన చర్యేనని, కనీసం రూ.25 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తితే పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పాలకేంద్రం యజమానిని కాపాడేందుకే ఎథిలిన్ గ్లైకాల్ కలిసిందని కొత్త కథలు సృష్టిస్తున్నారని, ఒకవేళ అది కలిసినట్లయితే పాల రంగులో మార్పు కనిపించాల్సి ఉంటుందని ప్రశ్నించారు. అసలు కల్తీ జరగలేదని చెప్పేందుకు కూటమి ప్రభుత్వం దారి మళ్లింపు రాజకీయాలు చేస్తోందన్నారు.
గతంలో పుష్కరాల తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందనను గుర్తు చేశారు. “అప్పటిలాగే ఇప్పుడు కూడా నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నమే జరుగుతోంది” అని ఆరోపించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాల లేమి వల్లే బాధితులను ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తోందని, డయాలసిస్ యంత్రాలు, వెంటిలేటర్లు వంటి కీలక పరికరాలు లేకపోవడం వైద్య వ్యవస్థ వైఫల్యమని మండిపడ్డారు.
రాష్ట్రంలో రోజుకు సుమారు 20 లక్షల లీటర్ల పాల వినియోగం జరుగుతుంటే, పర్యవేక్షణలో విఫలమైన ప్రభుత్వం ఈ ఘటనకు ప్రత్యక్ష, పరోక్ష కారణమని పేర్కొన్నారు. రక్త నమూనాలను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు.
“రాజమండ్రి వంటి నగరంలో ఇంతటి విషాదం జరిగినా వైద్యశాఖ మంత్రి కనిపించకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. లేదంటే ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే” అని మార్గాని భరత్ ఘాటుగా హెచ్చరించారు.
ఆసుపత్రుల్లో వృద్ధులు, పసిపిల్లల విలవిలలు – హృదయ విదారక దృశ్యాలు
RELATED ARTICLES
