– ప్రవచన యజ్ఞంలో సామవేదం షణ్ముఖ శర్మ
భగవంతుడు విశ్వరూపుడు అని వాగ్ధేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషి పీఠం, సత్సంగం, విశాఖపట్నం ఆధ్వర్యాన ఎంవీపీ కాలనీ, ఆరో సెక్టార్, ఎబీసీ పార్కులో 14 రోజుల శ్రీమద్భాగవవ ప్రవచన యజ్ఞం ఎనిమిదో రోజైన గురువారం సాయంత్రం ప్రవచనంలో నందుడు, యశోదల ఇంట వ్రేపల్లెలో జరిగిన శ్రీ కృష్ణుడి బాల్య, కౌమార దశల్లోనివివిధ లీలల్ని ఆవిష్కరించారు. కృష్ణ జననం, జననోత్సవాలతో జరిగిన కథను క్లుప్తంగా చెప్పి శ్రీ కృష్ణ తత్వంలో మధుర లీలలు, ఐశ్వర్య లీలలు అని రెండు రకాలుగా వర్గీకరించాలన్నారు. తనను ఆశ్రయించినవారికి ఉత్తమ సద్గతి అనుగ్రహించడమే శ్రీ కృష్ణ అవతారలో గొప్పతనమని ప్రవచనకర్త వర్ణించారు. గోప వనితలా మాయావేషంలో అక్కడికి వచ్చి స్థన్యమిచ్చి బాల కృష్ణుడ్ని అంతం చేయాలనుకున్న పూతన అనే రాక్షసి పాలు తాగుతూ ఆమె రక్తాన్ని పీల్చి నిజస్వరూపంలో మారి గిలిల తనుకుని చనిపోయిన విధాన్ని సామవేదం కళ్లకు కట్టినట్టు వివరించారు. ఆనక తల్లి దిష్టి తీసిన వైనాన్నీ వివరించి భావాతీతుడైన వాడే భగవంతుడు అన్నారు.
పరీక్షిత్ మహారాజుకు శుక యోగీంద్రుడు భాగవత కథను చెప్పనట్టు వ్యాసుడి కథనాన్ని అచ్చంగా ఆవిష్కరిస్తూనే భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన పోతన పద్యాలన్నీ అవసరానుగునంగా సామవేదం ఉటంకించారు.
గర్ఘ మహర్షి శ్రీ కృష్ణుడికి, బలరాముడికీ ఒకే రోజు నామకరణ చేసిన సంగతి వివరిస్తూ నిఘంటు అర్థంలో కాకుండా వేదార్థంలో కూడా వాటికి అర్థాలు తెలుసుకోవాలన్నారు. క్రిష్ అనే ధాతువుకు ఎప్పుడూ ఉండేది అన అర్థం. న అంటే ఆనందం, చిదానందం అన్నారు. కాలానికి అందరూ లొంగాల్సిందే అని కృష్ణ కథ ద్వారా తెలుసుకోవాలన్నారు. కృష్ణ నామం భక్తిని వృద్ధి చేస్తుంది. అచ్చమైన భక్తికి బేధ దృష్టి ఉండదు హరి ఉంటే సిరి ఉంటుంది అని సామవేదం వివరించారు. ఏక కాలంలో సర్వవ్యాప్తమై ఉండటమే శ్రీ కృష్ణావతారంలో విశిష్ఠతగా ఆయన పేర్కొన్నారు. భగవంతుడు మానవుడి అవతారంలో ఉన్నా 100 శాతం మానవ లక్షణాలు కలిగి వాడే రాముడు అని సందర్భానుసారం చెప్పుకొచ్చారు. బాల కృష్ణుడు ఆవులించినప్పుడు తల్లి యశోదకు విశ్వరూపం కనిపించిన ఘట్టం. యుద్ధభూమిలో అర్జునుడికి మాయ తొలగించి విశ్వరూప దర్శనం అనుగ్రహించిన విషయాలను
ఆయన ఉటంకించారు. కౌమారంలో గోపాలక వృత్తి వహించినపుడు జరిగిన రాక్షస సంహారాలు తదితర సన్నివేశాలు ఆసక్తికరంగా ఆవిష్కరించారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులతో ఈ ప్రాంగణం కిటకిటలాడింది.
