ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదివి అనేక వ్యవసాయ పద్ధతులు
– పురాతన పద్ధతి లో ప్రకృతి ఆధారంగా అనేక పంటలు
– ఆకుకూరల నుండి దేశీయ పండ్లు మొక్కలు పెంచుతున్న జగదీష్
అనకాపల్లి /దేవరాపల్లి (జయ జయహే) ఆదాయం వంతంగా అడివి వ్యవసాయం చేస్తున్న అద్భుతమైన దృశ్యం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తామరబ్బ పంచాయతీ పల్లెపుకొరాబు గ్రామంలో కనిపిస్తుంది. విశాఖపట్టణానికి చెందిన సనపల జగదీష్ ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదువుకొని , పురాతన పద్ధతి లో ప్రకృతి ఆధారంగా అనేక పంటలు పండించడం విశేషం. అతని సతీమణి డాక్టర్ ఇందుకూరి విష్ణు ప్రియ కు వ్యవసాయం అంటే మక్కువ కావడంతో ఇద్దరూ ఇష్టంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈమె సైతం ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో డాక్టరేట్ చేయడం విశేషం. వీరిరువురు ఆకుకూరల నుండి అనేక వృక్షాలు పెంచుతున్న ఈ పొలాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలి. వ్యవసాయం దండగ, పెట్టుబడి పెట్టడమే ఆదాయం ఉండదని చెప్పెవారు అధికం. ఇటువంటి పరిస్థితుల్లో గడిచిన అయిదు సంవత్సరాలుగా ప్రకృతి ఆధారంగా వీరు పంటలు పండించడం విశేషం.
పట్టభద్రులు సాగిస్తున్న వ్యవసాయాన్ని వీక్షించడానికి విశాఖపట్నం నుంచి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, మ్యాంగొ మేన్ అప్పాజీ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, ఇంజినీర్ అల్లు గోపి, గోశాల ప్రతినిధి అచ్యుత రావు, సనపల ప్రసాద్ తదితరుల బృందం జగదీష్ కు చెందిన సమతుల్య ఫామ్ ను సందర్శించింది. వీరంతా అక్కడ పిలకలు తొలగించకుండా అరటి సాగు చేయడం చూసి ఆశ్చర్యపోయారు. ఒకే చెట్టు గుంపులుగా పెంచడం, ఆ గుంపులో రెండు మూడు గెలలు బలంగా పెరగడం గమనించారు. బోదెలు వేసి ఆకుకూరలు, కాయగూరలు పెంచడం, అడవి వ్యవసాయ పద్ధతి లో పండ్లు తోటలు పెంచడం, ప్రకృతి ఆధారంగా మల్చింగ్ పద్దతులు ద్వారా పంటలు పండించడం, రసాయనాలు వినియోగించకుండా అధిక దిగుబడి సాధించడం చాలా గొప్ప విశేషం. 150 కి పైగా పంటలు పండిస్తున్న ఈ యువత దేశంలో యువతకు ఆదర్శం అని ఈ పొలాన్ని సుందర్సించిన బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది.
