రాష్ట్ర ప్రభుత్వానికి వాసుపల్లి జానకిరామ్ విజ్ఞప్తి
గడిచిన కొద్ది రోజులుగా ఇరాన్ – అమెరికా / ఇజ్రాయిల్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం విశాఖ ఫిషింగ్ హార్బర్ పై పడింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మర పడవలకు అవసరమైన డీజిల్ పై పెంచిన 24 రూపాయలను తగ్గించాలని..ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేస్తోంది. ఇది అంశమై అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ మంగళవారం మధ్యాహ్నం ఫిష్ ఇంకాబర్ లోని గంగమ్మ తల్లి ఆలయం సమీపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధానికి ముందు మర పడవలకు ఉపయోగించే డీజిల్ లీటర్ ధర లీటర్ కు 98 రూపాయలు ఉండేది అన్నారు. ప్రభుత్వం ఇటీవల మరో పడవలకు ఉపయోగించే డీజిల్ ను పారిశ్రామిక విభాగంలో చేర్చిందన్నారు. ఫలితంగా లీటర్ పై అమాంతంగా 24 రూపాయలు పెరిగి ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర 122 రూపాయలుగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో మత్స్యకారులు జీవనం సాధించడమే కష్టంగా ఉందని.. పెరిగిన డీజిల్ ధరలు మత్స్యకారుల జీవితాల పై మరింత భారాన్ని మోపాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి 850 మరపడవలు వేటకు వెళతాయన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వేటకు వెళ్లడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మత్స్యకారుల జీవన పరిస్థితులను అర్థం చేసుకొని ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకోవాలని జానకి రామ్ విజ్ఞప్తి చేశారు.
