Home Politics Andhra Pradesh రాష్ట్రంలోనే తొలిసారి టీఏవీఆర్ శస్త్రచికిత్స విజయవంతం

రాష్ట్రంలోనే తొలిసారి టీఏవీఆర్ శస్త్రచికిత్స విజయవంతం

0

రాష్ట్రంలోనే తొలిసారిగా ఆధునిక టీఏవీఆర్ (ట్రాన్స్‌కాథెటర్ ఎఓర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి రాజమహేంద్రవరం నగరంలోని విజయభారతి చెస్ట్ ఇన్‌స్టిట్యూట్ – పల్స్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. 75 ఏళ్ల వృద్ధ మహిళకు మెడ్ట్రానిక్ ట్రాన్స్‌కాథెటర్ వాల్వ్ సిస్టమ్‌కు చెందిన ఎఫ్‌కే వాల్వ్‌ను ఉపయోగించి ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆధునిక వాల్వ్ ప్లాట్‌ఫామ్‌తో జరిగిన తొలి శస్త్రచికిత్సగా ఇది గుర్తింపు పొందింది.
సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చేసే మినిమల్ ఇన్వేసివ్ విధానమైన టీఏవీఆర్‌లో కాలి ఫెమొరల్ ఆర్టరీ ద్వారా కాథెటర్ ప్రవేశపెట్టి, దాని సహాయంతో దెబ్బతిన్న ఎఓర్టిక్ వాల్వ్ స్థానంలో కొత్త వాల్వ్‌ను అమర్చారు. ఈ విధానం వల్ల నొప్పి, రక్తస్రావం తక్కువగా ఉండటం, త్వరగా కోలుకునే అవకాశం ఉండటం వృద్ధులకు ఎంతో ఉపయోగకరమని వైద్యులు తెలిపారు.
రోగికి తీవ్రమైన ఎఓర్టిక్ స్టెనోసిస్‌తో పాటు ఇతర సంక్లిష్టతలు ఉండటంతో శస్త్రచికిత్స సవాలుగా మారినప్పటికీ ముందస్తు పరీక్షలు, ఖచ్చితమైన ఇమేజింగ్, వైద్య బృందం సమన్వయం వల్ల ఈ ప్రక్రియ విజయవంతమైంది.
ఈ శస్త్రచికిత్సను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు డాక్టర్ కొల్లూరి లక్ష్మణ్, డాక్టర్ వంశీకృష్ణంరాజు కోసూరి, డాక్టర్ సాజిత్ కిషన్ నిర్వహించారు. కార్డియాక్ అనస్థీషియా నిపుణులు, కాథ్ ల్యాబ్ సిబ్బంది సహకారం అందించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉండటంతో కొద్ది రోజుల్లోనే డిశ్చార్జ్ చేశారు.
ఈ సందర్భంగా విజయభారతి చెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అధినేత డాక్టర్ గూడూరి శ్రీనివాస్, సీఈవో రాధిక గూడూరి వైద్య బృందాన్ని అభినందించారు. మెట్రో నగరాలు కాకపోయినా టియర్-2 నగరమైన రాజమహేంద్రవరం నుంచే అత్యాధునిక హృదయ చికిత్సలను అందించడం గర్వకారణమని తెలిపారు.
పల్స్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక కాథ్ ల్యాబ్‌తో పాటు సమగ్ర హృదయ, ఊపిరితిత్తుల చికిత్సా సేవలు అందుబాటులో ఉండగా, ఐదుగురు పల్మనాలజిస్టులు, ముగ్గురు కార్డియాలజిస్టులు కలిసి రోగులకు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version