పంచ డిజిటల్ విప్లవానికి బలమైన పునాది వేసిన తొలి కంప్యూటర్ చరిత్రలో ఇనియాక్ పేరుతో నిలిచిపోయింది. దీని పూర్తి పేరు ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ ). పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన అమెరికా దేశంలో ప్రజలకు పరిచయం చేయబడిన ఈ యంత్రం, ప్రపంచంలోనే తొలి జనరల్ పర్పస్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ గా గుర్తింపు పొందింది. ఈ అద్భుత యంత్రాన్ని జాన్ మచ్లీ మరియు జె. ప్రెస్పర్ ఎకర్ట్ రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్టిలరీ ఫైరింగ్ టేబుల్స్ గణనలను వేగంగా చేయాల్సిన అవసరం ఏర్పడటంతో, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని మూర్ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో దీని నిర్మాణం ప్రారంభమైంది.
ఈ కంప్యూటర్ పరిమాణం అత్యంత విశేషమైనది. ఇది దాదాపు ముప్పై టన్నుల బరువు కలిగి ఉండేది. దీని నిర్మాణంలో సుమారు పద్దెనిమిది వేల వాక్యూమ్ ట్యూబ్స్ ఏడు వేల క్రిస్టల్ డయోడ్స్ , పది వేల కెపాసిటర్స్ మరియు డెబ్బై వేల రెసిస్టర్స్ ఉపయోగించారు. ఒక పెద్ద గదిని పూర్తిగా ఆక్రమించేంత అంటే సుమారు ఒక వెయ్యి ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణం దీనికి అవసరమయ్యేది. నేటి ఆధునిక లాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ లతో పోలిస్తే ఇది ఒక రాక్షస యంత్రంలా కనిపించినా, ఆనాటి కాలంలో ఇది ఒక గొప్ప టెక్నాలజీ అద్భుతం. దీనిని నడపడానికి సుమారు నూట యాభై కిలోవాట్స్ విద్యుత్ శక్తి అవసరమయ్యేది.
గణన వేగం విషయానికి వస్తే, ఈ యంత్రం ఒక సెకను కాలంలో ఐదు వేల కూడికలు చేయగలిగేది. అప్పటి వరకు ఉన్న మెకానికల్ క్యాలిక్యులేటర్స్ తో పోలిస్తే ఇది వెయ్యి రెట్లు వేగవంతమైనది. అయితే దీనిని ప్రోగ్రామింగ్ చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. కొత్త గణనలు చేయాలంటే వేలాది స్విచ్చెస్ సర్దడం మరియు కేబుల్స్ మార్చడం వంటి పనులు చేయాల్సి వచ్చేది. దీనివల్ల ఒక కొత్త ప్రోగ్రామ్ సిద్ధం చేయడానికి కొన్ని రోజుల సమయం పట్టేది. ఈ యంత్రంలో సమాచారాన్ని నిల్వ చేయడానికి మెమరీ సౌకర్యం నేటి స్థాయిలో లేకపోవడం ఒక ప్రధాన లోపంగా ఉండేది. అయినప్పటికీ బాలిస్టిక్స్, వాతావరణ అంచనాలు మరియు అటామిక్ ఎనర్జీ లెక్కల్లో దీనిని విజయవంతంగా ఉపయోగించారు.
ప్రపంచపు తొలి కంప్యూటర్ అనే అంశంపై చరిత్రలో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. జర్మనీకి చెందిన కొన్రాడ్ జూస్ రూపొందించిన జెడ్-త్రీ అనే యంత్రం మరియు బ్రిటన్‌కు చెందిన కొలోసస్ వంటివి ముందే ఉన్నప్పటికీ, అవి పరిమిత ప్రయోజనాలకే ఉపయోగపడ్డాయి. ఇనియాక్ మాత్రమే పూర్తిస్థాయి ప్రోగ్రామబుల్ మరియు ఎలక్ట్రానిక్ సామర్థ్యం కలిగి ఉండటంతో దీనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. దీని అభివృద్ధిలో ఆరుగురు మహిళా గణిత శాస్త్రజ్ఞులు తొలి ప్రోగ్రామర్స్ గా కీలక పాత్ర పోషించడం విశేషం.
ఈ ఆవిష్కరణతో ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి శ్రీకారం చుట్టబడింది. తరువాత కాలంలో వాక్యూమ్ ట్యూబ్స్ స్థానంలో ట్రాన్సిస్టర్స్ మరియు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వచ్చాయి. నేడు మనం ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సూపర్ కంప్యూటర్స్ అన్నింటికీ ఆద్యం ఈ తొలి యంత్రామే. ఒకప్పుడు గది నిండా విస్తరించిన పరికరం, నేడు మన చేతిలో ఇమిడిపోయే స్థాయికి చేరింది. మానవ మేధస్సు మరియు సృజనాత్మకతకు ఈ పరిణామ క్రమం ఒక నిదర్శనం. ఇనియాక్ కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, అది ఆధునిక యుగానికి ద్వారాలు తెరిచిన ఒక చారిత్రక మైలురాయి.
(సి.హెచ్.ప్రతాప్)
