భారతీయ చలనచిత్ర పరిశ్రమ వంద సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. నిశ్శబ్ద చిత్రాల యుగం నుండి నేటి ఆధునిక డిజిటల్ యుగం వరకు భారతీయ సినిమా ప్రయాణంలో సంగీతం ఎప్పుడూ ఒక అంతర్భాగంగా ఉంటూ వస్తోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి సంగీత దర్శకుడిగా ఫిరోజ్‌షా మిస్త్రీ నిలుస్తారు. 1931లో విడుదలైన భారతదేశపు మొదటి టాకీ చిత్రం ఆలమ్ ఆరా కు ఆయన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం భారతీయ సినిమా గమనాన్ని మార్చడమే కాకుండా వెండితెరపై సంగీతానికి మరియు పాటలకు పునాది వేసింది.
ఆలమ్ ఆరా చిత్రంలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఇప్పటిలాగా రికార్డింగ్ స్టూడియోలు లేకపోవడంతో షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నేపథ్య సంగీతాన్ని కూడా లైవ్ లో రికార్డ్ చేసేవారు. ఫిరోజ్‌షా మిస్త్రీ ఇతర సంగీతకారులతో కలిసి హార్మోనియం మరియు తబలా వంటి వాయిద్యాల సహాయంతో ఆ పాటలను స్వరపరిచారు. ఈ చిత్రంలోని దే దే ఖుదా కే నామ్ పే అనే పాట భారతీయ సినీ చరిత్రలోనే తొలి పాటగా రికార్డు సృష్టించింది. దీనిని వజీర్ మహ్మద్ ఖాన్ ఆలపించారు. ఈ పాట అప్పట్లో ప్రజల్లోకి ఎంతగా దూసుకెళ్లిందంటే సంగీతం సినిమాకు ఎంతటి బలాన్ని ఇస్తుందో అందరికీ అర్థమయ్యేలా చేసింది.
భారతీయ సంగీత దర్శకుల పరిణామ క్రమంలో మరొక ముఖ్యమైన పేరు నౌషాద్ అలీ. ఆయనను భారతీయ చిత్ర సంగీతంలో ఒక దృవతారగా అభివర్ణించవచ్చు. 1940లలో రంగ ప్రవేశం చేసిన నౌషాద్ భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని సామాన్య ప్రజలకు సినిమా ద్వారా చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన బైజూ బావరా, మొఘల్-ఏ-ఆజం వంటి చిత్రాలకు అందించిన సంగీతం అజరామరమైనది. సంగీతంలో పాశ్చాత్య మరియు భారతీయ వాద్యాలను మేళవించడంలో ఆయన ఒక కొత్త ఒరవడిని సృష్టించారు.
తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద కు సంగీతాన్ని అందించిన ఘనత హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రికి దక్కుతుంది. ఆ తర్వాత గాలిపెంచల నరసింహారావు, సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు వంటి దిగ్గజాలు తెలుగు సినీ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. భారతీయ సినీ సంగీత దర్శకులు కేవలం పాటలు మాత్రమే కాకుండా నేపథ్య సంగీతం ద్వారా సినిమాలోని భావోద్వేగాలను పండించడంలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
నేడు ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఎం.ఎం. కీరవాణి వంటి సంగీత దర్శకులు అంతర్జాతీయ వేదికలపై భారతీయ సంగీత పతాకాన్ని ఎగురవేస్తున్నారు. వీరందరికీ స్ఫూర్తి ఫిరోజ్‌షా మిస్త్రీ వంటి తొలితరం సంగీతకారులే. పరిమిత వనరులతో ఎటువంటి సాంకేతిక సౌకర్యాలు లేని కాలంలో వారు చేసిన ప్రయోగాలు నేటి ఆధునిక సంగీతానికి గట్టి పునాదులు వేశాయి. సినిమాలలో పాటలు అనేవి కేవలం వినోదం కోసమే కాకుండా కథను ముందుకు నడిపే ప్రధాన పాత్రలుగా మారడానికి ఈ మహనీయుల కృషి ఎంతైనా ఉంది. భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఫిరోజ్‌షా మిస్త్రీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
(సి.హెచ్.ప్రతాప్)
