-ఏడోరోజు ప్రవచిస్తున్న సామవేదం షణ్ముఖ శర్మ
అహంకార సమర్పణే భక్తి అని వాగ్ధేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషి పీఠం, సత్సంగం, విశాఖపట్నం ఆధ్వర్యాన ఎంవీపీ కాలనీ, ఆరో సెక్టార్, ఎబీసీ పార్కులో 14 రోజుల శ్రీమద్భాగవవ ప్రవచన యజ్ఞం ఏడో రోజైన బుధవారం సాయంత్రం ప్రవచనంలో బలిచక్రవర్తి దానం-వామనావతారాన్ని ప్రవచనకర్త ఆసక్తికరంగా, అద్భుతంగా, రసవత్తరంగా ఆవిష్కరించారు. కడుపు పొక్కు మాన్పి కానవయ్యా.. అని అతిథీ దేవి నారాయణుడ్ని వేడుకోగా తాను స్వయంగా కొడుకుగా జన్మిస్తానని ఇచ్చిన అభయానికి కార్యరూపమే వామనావతారమన్నారు. అవతారాలన్నింటికల్లా ఉత్తమం వచ్చిన వెంటనే కార్యం నెరవేర్చిన అవతారంగా ఆయన పేర్కొన్నారు. భక్త ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు ఆయన సతీమణి అతిథీ దేవికి పుట్టిన వామనుడి కథను వివరిస్తూ.. వామనుడి పుట్టుకే ఉపనయన వయస్సు అంటే మూడు నుంచి ఐదేళ్లలోపు జరిగే ఉపనయన ఘట్టం కళ్లకు కట్టారు. సర్వ దేవతల సమక్షంలో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లి తనకు దానం ఇస్తానని పట్టుబట్టిన సందర్భంలో తనకు మూడడుగుల నేల దానంగా ఇమ్మని అడిగిన సందర్భంలో జరిగిన అద్భుతాలు వివరించారు. ఇంతింతై వటుడింతై… చక్కటి పద్యాలతో కథను వివరించారు. బలి అనేమాటకు పూజ, అర్పణం అని రెండు అర్థాలు. బలి ఎలా ఉండాలో బలిచక్రవర్తిదగ్గర నేర్చుకోవాలన్నారు. మమకార, అహంకారాలు సమర్పించడమే అసలైన భక్తికి నిర్వచనమని ఆయన వివరించారు. అహంకారం తొలగాలి. అర్పణం తెలియాలి అదీ జన్మ రహస్యం. నారాయణుడుతప్ప వేరేదీ కనపడకపోవడమే యోగమని ఆయన పేర్కొన్నారు. అర్పణ బుద్ధి ఉన్నవాడికి అంతా నారాయణుడే. దానంతో దానవరాజు కీర్తిలో విశిష్టడైపోయాడు.వామనుడి అవతారం దివ్య అవతారమని సామవేదం వివరించారు. ద్వితీయ కథాంశంగా శ్రీకృష్ణ జనంలోకి ప్రవేశించి భక్తుల్ని ఆనంద పారవశ్యంలో మెంచెత్తారు. భగవంతుడు సత్పురుషుల్లో ఉంటాడు. తపస్సు స్వరూపం త్రివిక్రమత్వ మన్నారు.
