నిర్వహణ లేక బొమ్మలు ధ్వంసం – చెత్తతో నిండిన వాకింగ్ ట్రాక్
భక్తులు, పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో గోదావరి బండ్‌పై భారీగా ఖర్చు చేసి ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరింది. కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద రూ.1.50 కోట్ల నిధులతో 2023లో నిర్మించిన వాకింగ్ ట్రాక్, విద్యుత్ దీపాలు, పిల్లల ఆటపరికరాలు రెండేళ్లకే పనికిరాని స్థితికి చేరడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ సమయంలో అప్పటి హోంమంత్రి, కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత, అప్పటి రుడా చైర్మన్ మేడపాటి షర్మిలా రెడ్డి అట్టహాసంగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు. భక్తులు, సందర్శకులు వాకింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేకంగా ట్రాక్ నిర్మించడంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు పలు ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అలాగే సింహం, ఏనుగు, సీతాకోకచిలుకలు వంటి ఆకర్షణీయమైన శిల్పాలను కూడా ఏర్పాటు చేసి ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దారు.
అయితే ప్రారంభోత్సవం తర్వాత నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా మారింది. పిల్లలను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన బొమ్మలు ఒక్కొక్కటిగా ధ్వంసమవుతున్నాయి. సింహం బొమ్మకు తోక ఊడిపోవడంతో అది వికారంగా మారింది. సీతాకోకచిలుకల బొమ్మలు పూర్తిగా పాడై గుర్తుపట్టలేని స్థితికి చేరాయి.
పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన ఆటపరికరాలు కూడా పనికిరాని పరిస్థితికి చేరి మూలకు చేరాయి. చాలా చోట్ల అవి విరిగిపోయి ప్రమాదకరంగా మారాయి. చిన్నారులు ఆడుకోవడానికి అనుకూలంగా లేని పరిస్థితి ఏర్పడడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాకింగ్ ట్రాక్‌పై ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు కూడా పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో పూర్తిగా చీకటి కమ్ముకుంటోంది. దీంతో భక్తులు, వాకింగ్‌కు వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.
ఇదే కాకుండా వాకింగ్ ట్రాక్ మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది. పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాల్సిన ప్రదేశం ప్రస్తుతం చెత్తకుప్పలా మారడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గోదావరి తీరం అందాలు ఆస్వాదించేందుకు వచ్చే భక్తులు ఈ పరిస్థితిని చూసి నిరాశ చెందుతున్నారు.
ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టినా, నిర్వహణ లేకపోవడం వల్ల ప్రజా ధనం వృథా అవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాకింగ్ ట్రాక్, పిల్లల ఆటపరికరాలు, విద్యుత్ దీపాలను మరమ్మతు చేసి ప్రదేశాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



