రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రధాన ద్వారం సమీపంలో ఉన్న ఓ వృక్షం ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితిలో ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు పై భాగం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో ఇది ఎప్పుడు అయినా విరిగి పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
సెంట్రల్ జైలులో ఖైదీలను ములాఖాత్ ద్వారా కలిసేందుకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వేచిచూడే సమయంలో పలువురు ఈ చెట్టు నీడలోనే సేదతీరుతున్నారు. చెట్టు కిందనే పత్రిక విలేకరుల సమావేశాలు కూడా తరచూ జరుగుతుండటం గమనార్హం. గతంలో మిథున్ రెడ్డిను ములాఖాత్ ద్వారా కలిసేందుకు వచ్చిన వైసీపీ నాయకులు ఇదే ప్రదేశంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును కలిసే పార్టీ నాయకులు సైతం ఈ చెట్టు కిందనే సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చెట్టు ఎత్తైన భాగం ఎండిపోయి కుళ్లిపోవడంతో ఎటువంటి అపరిచిత ప్రమాదం సంభవించినా భారీ నష్టం జరిగే అవకాశం ఉందని సందర్శకులు భయాందోళన చెందుతున్నారు. రోజువారీగా ఖైదీల కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు ఈ ప్రాంతంలో గుమిగూడుతుండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
అధికారులు తక్షణమే స్పందించి చెట్టు పరిస్థితిని పరిశీలించి అవసరమైతే తొలగింపు లేదా భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం సంభవించిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందస్తుగా నివారణ చర్యలు తీసుకోవడం అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత శాఖలు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని జయజయహే పత్రిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.
