- క్రికెట్ క్షేత్రంలో ఆడపులి
- కల నెరవేరింది: 13 ఏళ్లకే ఏపీఎల్‌లో అనంతపురం సంచలనం దండు చక్రిక
- ఆ సినిమా చూసి… అండర్-23లోకి దూసుకెళ్లిన వైనం
- తండ్రి ప్రోత్సాహం, కూతురి దీక్ష: ఏపీఎల్‌కు ఎంపికైన 13 ఏళ్ల ఆంధ్ర క్రికెట్ కిషోరం
(వేణుగోపాల్‌రెడ్డి/ అనంతపురం)
క్రికెట్ అంటే కేవలం అబ్బాయిల ఆట మాత్రమే అనే భావనలు బలంగా ఉన్న ప్రస్తుత సమాజంలో, ఆ అపోహలను పటాపంచలు చేస్తూ ఒక పదమూడున్నర సంవత్సరాల బాలిక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. చిన్నతనంలో చూసిన ఒక సినిమాలో కథానాయికలాగే తాను కూడా దేశం గుర్తించే క్రికెటర్‌గా నిలబడాలన్న గట్టి తపన ఆమెను మైదానంలోకి నడిపించింది. తొలి అడుగులోనే తన కూతురి పట్టుదల, ఆట పట్ల ఆమెకున్న నిబద్ధతను గమనించిన తండ్రి సంపూర్ణ సహకారం తోడు కావడంతో, ఈ యువ కెరటం వెనుదిరిగి చూడలేదు. బౌలింగ్, బ్యాటింగ్‌లలో నిలకడ కనబరుస్తూ కేవలం 13.5 ఏళ్ల అతి చిన్న వయసులోనే జిల్లా, జోనల్ స్థాయిల నుంచి నేరుగా అండర్-19, అండర్-23 విభాగాల్లో తన ప్రతిభను చాటుకుంది. తాను కన్న కలను కేవలం ఊహగానే ఉంచకుండా, నిరంతర శ్రమ, అంకితభావంతో పోరాడిన దండు చక్రిక… తాజాగా జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో స్థానం సంపాదించుకుని సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించిన దండు చక్రికను మలిచిన ఆ సినిమా ఏది? ఆ స్థాయికి చేరుకోవడానికి ఆమె పడిన శ్రమ, ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? భవిష్యత్తులో ఆమె లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయి? అనే ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలంటే… ఈ అనంతపురం యువ క్రికెట్ సంచలనం కథ కమామీషును చదవాల్సిందే.
కౌసల్య కృష్ణమూర్తి సినిమా స్ఫూర్తితో
అబ్బాయిలతో సమానంగా ప్రాక్టీస్
క్రికెట్ ప్రాక్టీసు చేయడం మొదలు పెట్టిన మొదటి సంవత్సరంలోనే అబ్బాయిలతో సమానంగా ప్రాక్టీస్ చేసేది. దాన్ని గమనించి తల్లితండ్రులు అండర్ 15 సెలక్షన్స్ కు పంపించారు. అప్పటికి అమ్మాయి వయస్సు 12 సంవత్సరాల లోపు మాత్రమే. 12 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అండర్ 15 ఆడడానికి అవకాశం లేదని అనడంతో అప్పుడు డైరెక్టుగా అండర్ 19 ఆడించారు. ఆ సెలక్షన్స్ లో మంచి ప్రతిభ కనబరచి ఎక్కువ వికెట్లు సాధించి జిల్లాకు సెలెక్ట్ అయింది. అంతటితో ఆగకుండా జిల్లా స్థాయిలో కూడా ఐదు వికెట్లు సాధించి జోనల్ లెవెల్ కి అర్హత సాధించింది. పన్నెండు సంవత్సరాలు దాటిన వారికి లో అండర్ 15 లో ఆడటానికి 2024 లో బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఆ సంవత్సరం జిల్లా స్థాయిలో, సౌత్ జోన్ స్థాయిలో బౌలింగ్ విభాగం, బ్యాటింగ్ లోనూ మంచి ప్రతిభ కనపరచింది. ఆ సంవత్సరం జిల్లా స్థాయిలో, సౌత్ జోన్ లో ఎక్కువ వికెట్లు సాధించి ఆంధ్ర జట్టుకు సెలెక్ట్ అయింది.
ఆంధ్ర జట్టు కు 2024 లో ప్రాతినిధ్యం వహించి అదే సంవత్సరం ఇండియా స్థాయిలో బౌలింగ్ విభాగంలో 17 వికెట్లు పడగొట్టి ఏడవ ర్యాంకు సాధించింది. ఆంధ్ర తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా గుర్తింపు పొందింది. ఈ సంవత్సరం అండర్ 19 విభాగంలో స్టేట్ ప్రాబబుల్స్, అండర్ 23 విభాగంలో స్టేట్ ప్రొబబుల్స్ కు అర్హత సాధించింది. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో అతి తక్కువ వయస్సు కలిగిన అమ్మాయి గా గుర్తింపు పొంది, వైజాగ్ “CHEETAS” టీమ్ కు సెలెక్ట్ అయింది. 2024-25 ఈ రెండు సీజన్ లలో ఆంధ్ర లో బౌలింగ్ విభాగం లో ఆంధ్ర సెలెక్టర్ ల దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో ఆంధ్ర తరపున మంచి ఆల్ రౌండర్ గా రాణించే అవకాశాలు ఉన్నాయని సెలెక్టర్ ల నుంచి కితాబు అందుకుంది.
ఏపీఎల్ లో అతి పిన్న వయస్కురాలు
ఈ సంవత్సరం నిర్వహించిన ఏపీఎల్ లో అతి పిన్న వయస్కురాలుగా గుర్తింపు పొందింది. దీంతోపాటు చక్రిక 11 ఏళ్లకే అండర్ 19 లో జిల్లాస్థాయి లో క్రికెట్ ఆడింది. 23 సార్లు జోనల్స్ ఆడింది. ఈ ఏడాది ఏపీఎల్ లో ఆడే అవకాశం వచ్చి ఒక మ్యాచ్ కూడా ఆడింది. 2024 లో అండర్ 15 లో బౌలింగ్ విభాగంలో అత్యధిక వికెట్లు తీసుకుని ఆల్ ఇండియా స్థాయిలో ఏడవ ర్యాంకు సాధించింది. లెగ్ స్పిన్నర్ గా రాణిస్తూనే బ్యాటింగ్ లోనూ పరుగుల వరద పారిస్తోంది.
అల్ రౌండర్ గా రాణిస్తూ జాతీయ జట్టులో స్థానం సంపాదించాలి : దండు చక్రిక

క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం : దండు శివప్రసాద్, దండు చక్రిక తండ్రి.
క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. నా కూతురు క్రికెట్ ఆడతాను అని చెప్పగానే ఎంతో సంతోషం కలిగింది. అయితే చిన్న వయసులో అమ్మాయికి ఏమి తెలియదు అనుకున్నా కానీ తాను పట్టుబట్టి క్రికెట్ ఆడడానికి ఒప్పించింది. దీంతో నేను కూడా సరే అని ఒప్పుకున్నాను. అమ్మాయిని అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా పెంచాను. క్రికెట్ లో రాణించేలా శిక్షణ ఇప్పిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఏపీఎల్ లో ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అత్యంత వెనుకబడ్డ అనంతపురం జిల్లా నుంచి భారత జాతీయ మహిళల క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలని కోరుకుంటున్నాను.
ఇష్టంగా ఆడుతుంది : సాగర్, కోచ్
చక్రిక నెట్స్ లతో పాటు వివిధ మ్యాచ్ లలో ఇష్టంగా ఆడుతుంది. తను చాలా నేచురల్ గా ఆడుతుంది. తనలో ఉన్న నేచురల్ టాలెంట్ ను చూసి లెగ్ స్పిన్ బౌలింగ్ విభాగంలో ఒక సంవత్సరం పాటు కొన్ని కొన్ని స్పెసిఫిక్ కరెక్షన్ లు చేశాను. దీంతో రాష్ట్ర స్థాయిలో చక్రిక బౌలింగ్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. ఆలిండియా ర్యాంకింగ్ లో ఆంధ్ర టీం సెమీఫైనల్ లో ఓడిపోయినప్పటికీ చక్రిక మాత్రం ఏడవ స్థానం లో నిలిచింది. ఒకవేళ మ్యాచ్ గెలిచి ఉంటే మాత్రం చక్రిక ర్యాంకింగ్ లో ఒకటవ స్థానానికి చేరుకునేది. రానున్న రోజుల్లో జాతీయ మహిళ జట్టులో ఒక మంచి ఆల్ రౌండర్ గా స్థానం సంపాదింకుంటుంది.