విశాఖ మెట్రో సాంకేతిక ప్రక్రియలు త్వరలో పూర్తి
మూడు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తికి చర్యలు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ
పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడులను సమీకరించడం, పట్టణ స్థానిక సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో యూవిన్ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రతినిధులతో ప్రాంతీయ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులను క్యాపిటల్ మార్కెట్ల ద్వారా సమీకరించడం, మున్సిపల్ బాండ్లు, ఇతర పెట్టుబడి అవకాశాలను వినియోగించడం వంటి అంశాలపై ఈ వేదికలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థలు అభివృద్ధి ప్రాజెక్టులను రూపొందించడంలో, ఆర్థిక వనరులను సమీకరించడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఈ తరహా వర్క్‌షాప్‌లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, రవాణా, గృహ నిర్మాణం వంటి కీలక రంగాల్లో బ్యాంకబుల్ ప్రాజెక్టులను సిద్ధం చేయడానికి సాంకేతిక, ఆర్థిక మార్గదర్శనం అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ప్రారంభమైన గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో ఆలస్యం జరిగినప్పటికీ, వాటిని పూర్తి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో సుమారు 20 వేలకుపైగా గృహాలు నిర్మాణ దశలోనే నిలిచిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ గృహ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే వేలాది ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, జూన్ నెలాఖరు నాటికి సుమారు 2.60 లక్షల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 90కు పైగా మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయని, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఆస్తుల వినియోగం, ఆదాయ వనరుల విస్తరణ వంటి మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు జాయింట్ కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించామని చెప్పారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుపై “రైడర్స్” సంస్థ అధ్యయనం చేస్తోందని, రెండు నెలల్లో ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం పనులను వేగవంతంగా చేపట్టి మెట్రో ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్ తరహాలో విశాఖపట్నానికి సెమీ రింగ్ రోడ్ అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు ఈ ప్రాజెక్టును వీఎంఆర్‌డీఏ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన ఒక రహదారి నిర్మాణానికి అటవీ భూమి అడ్డంకిగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో చర్చించి సమస్యను పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం సెంటు భూమి కేటాయింపుల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందన్నారు. అయితే విచారణ కారణంగా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
