Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradesh"ముఖ్యమంత్రి.. ఇచ్చిన హామీ నెరవేర్చండి"

“ముఖ్యమంత్రి.. ఇచ్చిన హామీ నెరవేర్చండి”

గిరిజన ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం తక్షణమే తీసుకురావాలి

– ఆదివాసీ జేఏసీ అల్లూరి జిల్లా చైర్మన్ రామారావు దొర

– ముంచంగిపుట్టులో ఆదివాసి సత్యాగ్రహ యాత్ర ప్రారంభం

భారీ శాంతియుత ర్యాలీ

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజనులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) అల్లూరి జిల్లా చైర్మన్, కన్వీనర్ రామారావు దొర డిమాండ్ చేశారు. ‘షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం’ సాధనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర’ శనివారం ముంచంగిపుట్టు మండలం కించాయిపుట్టు పంచాయతీ రాములు గ్రామంలో ప్రారంభం అయింది. ఈ సత్యాగ్రహ యాత్ర.. పలు గిరిజన గ్రామాల మీదుగా కొనసాగింది. అనంతరం ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గిరిజన సంఘాలు, యువత ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో రామారావు దొర ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు నూరు శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో రద్దు కావడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో మంది యువతీ యువకులు తీవ్రంగా నష్టపోయారని, నిరుద్యోగులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన నిరుద్యోగుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలని, ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానిక ఆదివాసీలకే రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పలుల లింగన్న, సమరెడ్డి మోదకొండ, కొండ సీమ రాధాకృష్ణ, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు పార్థసారథి, మణుగూరు బాబూజీ, బూడిద మాధవరావు, జేఏసీ నాయకులు సురేష్ కుమార్ తో పాటు పెద్ద ఎత్తున గిరిజనులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments