కాన్షీరాం 92వ జయంతి సందర్భంగా ఈనెల 15న “ఛలో రావులపాలెం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని రాజమండ్రి రూరల్ ఇంచార్జ్ మండపల్లి సూరిబాబు కార్యాలయంలో పార్టీ నాయకులు ఆవిష్కరించారు.
రావులపాలెం బస్టాండ్ ఎదురుగా ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ పార్క్ వద్ద కాన్షిరాం జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ 15వ తేదీ ఉదయం 9 గంటలకల్లా బహుజనులు, కాన్షిరాం అభిమానులు పెద్దఎత్తున రావులపాలెం సెంటర్‌కు తరలిరావాలని పిలుపునిచ్చారు. బహుజనులకు రాజకీయ అధికారం రావాలంటే ఐక్యత అవసరమని, మాయావతి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. బీఆర్ అంబేద్కర్ ఆశించిన బహుజనుల రాజ్యాధికారం బీఎస్పీ ద్వారానే సాధ్యమని చెప్పారు. జిల్లాలో నుంచి కనీసం 300 మంది హాజరుకావాలని కోరారు.
జిల్లా కోశాధికారి ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ కాన్షిరాం తన ఉద్యోగాన్ని వదిలి కోట్లాది దళితుల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. 1984 ఏప్రిల్ 14న బహుజన సమాజ్ పార్టీని స్థాపించి బహుజనుల రాజకీయ సాధికారత కోసం పోరాడారని పేర్కొన్నారు.
జిల్లా ఇంచార్జ్ నక్కా వెంకటరత్నరాజు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ప్రాంతాల నుంచి పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండపల్లి సూరిబాబు, కొత్తపల్లి శేఖర్, ఆవిడి సునీత, మండా సుబ్రహ్మణ్యం, కొత్తపల్లి గౌతం, సాకిరి ధర్మరాజు, సీతానగరం బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
