చిత్తశుద్ధి ఉంటే తీర్మానంను బలపరచాలి
ఈవీఎంల మాయని దొంగ ఏడుపులు ఏడ్చారు కదా
మోదీ దత్తపుత్రుడునని నిరూపించుకుంటున్నారు
వైసీపీ అధినేత జగన్ పై పీసీసీ చీఫ్ షర్మిల మండిపాటు
విజయనగరం పర్యటనలో ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, తన సోదరుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి తీసుకువచ్చిన అభిశంసన తీర్మానానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తమ పార్టీ ఎంపీలతో ఈ తీర్మానంపై సంతకాలు చేయించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఈవీఎంలు మారిపోయాయని, మహిళల ఓట్లు గల్లంతయ్యాయని గతంలో జగన్ చేసిన విమర్శలను షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దొంగతనంగా ఏర్పడిందని, ప్రజా తీర్పును అపహాస్యం చేశారని మీరు ఏడ్చిన దొంగ ఏడుపులు నిజమే అయితే.. ఇప్పుడు ఎన్నికల కమీషన్‌పై పోరాడే అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అని ఆమె నిలదీశారు. జగన్ కేవలం మోదీకి దత్తపుత్రుడు కాదని నిరూపించుకోవాలంటే ఈ తీర్మానానికి మద్దతు తెలపాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో ఎన్నికల వ్యవస్థను ప్రధాని మోదీ తన గుప్పిట్లో పెట్టుకున్నారని షర్మిల ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అవసరమైన చోట దొంగ ఓట్లు చేర్చడం, అవసరం లేని చోట ఓట్లు తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదనడానికి ఏపీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే ఇండియా కూటమి ఎంపీలతో కలిసి గళం విప్పాలని, లేదంటే ఆయన బీజేపీకి బీ-టీమ్ అని ఒప్పుకోవాలని షర్మిల విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే తన స్వప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ పెద్దలకు తలొగ్గుతున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల కమీషన్ తీరుపై పోరాటంలో వైఎస్సార్‌సీపీ వైఖరిని బట్టే ఆ పార్టీ విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని షర్మిల అభిప్రాయపడ్డారు. విజయనగరంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈవీఎంలు, ఎన్నికల నిర్వహణపై జగన్ గతంలో చేసిన ఆరోపణలను ఇప్పుడు ఆయనకే అస్త్రంగా మార్చి షర్మిల సంధించడం గమనార్హం.

