నగరంలో మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. 40వ డివిజన్ బోడపాటి వారి వీధిలో రూ.8 లక్షలతో 450 మీటర్ల సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. మెయిన్ రోడ్లకు అనుసంధానంగా ఇన్నర్ రోడ్లు, డ్రైన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. 2024 నుంచి నగరవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా సాగుతున్నాయన్నారు. పార్కులు, గ్రీనరీ పెంపుతో ఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుందని, కాలుష్యం తగ్గి జీవన నాణ్యత మెరుగవుతుందని తెలిపారు. డివిజన్‌లో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకుని తక్షణ పరిష్కారాలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
